YCP Kandukur Incident: ఏపీలో( Andhra Pradesh) కుల చిచ్చు ప్రయత్నాలు జరుగుతున్నాయా? కులాల మధ్య అగ్గి రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారా? 1988 నాటి పరిస్థితులను తేవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మయ్య నాయుడు హత్య జరిగింది. ఆ కేసులో నిందితుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్. ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. కానీ దీని వెనుక రాజకీయ రంగు పులిమి.. కులాల మధ్య కుంపట్లు రగిలించి రాజకీయ వేడి కాచుకోవాలని చూస్తున్నారు. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. 1988లో కాపు సామాజిక వర్గానికి చెందిన రంగా హత్య ద్వారా.. కులాల చిచ్చు రగిలి 1989 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. మరోసారి అటువంటి ఫలితాన్ని రిపీట్ చేయాలని ఈ కొత్త పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది.
* అభిమానుల ముసుగులో..
మొన్న ఆ మధ్యన అసెంబ్లీలో బాలకృష్ణ( Balakrishna) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆ సమయంలో చిరంజీవి అభిమానుల పేరిట కొంతమంది హడావిడి చేశారు. అయితే ఇదే క్రమంలో వైసిపి కృత్రిమ అభిమానులు సైతం తయారైనట్లు ప్రచారం సాగింది. చిరు అభిమానుల్లో కొంతమంది వైసీపీ మనుషులను పంపించి బాలకృష్ణ కు వ్యతిరేకంగా మాట్లాడించినట్లు తెలుస్తోంది. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన సిఐడి మాజీ చీఫ్ అనుచరులను రంగంలోకి దించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ మాజీ ఐపీఎస్ అధికారి కటకటాల పాలయ్యారు. ఆయన వైసీపీ హయాంలో తనకంటూ అన్ని జిల్లాల్లో కొంతమంది అనుచరులను పెట్టుకున్నారు. మొన్నటి బాలకృష్ణ వ్యాఖ్యలతో ఆ మాజీ ఐఏఎస్ అధికారి అనుచరులు రంగంలోకి దిగారు. బాలకృష్ణ కు వ్యతిరేకంగా, చిరంజీవికి అనుకూలంగా మాట్లాడారు.
* ఓ నేతకు బాధ్యతలు..
తాజాగా కందుకూరు( kandukur ) ఘటనకు సంబంధించి.. వైసీపీకి చెందిన ఒక కాపు నేతకు బాధ్యతలు అప్పగించారట జగన్మోహన్ రెడ్డి. కేవలం కాపు నేతగా ఉన్న ఆయన వెనుక వైసిపి ఉన్నది అన్నది బహిరంగ రహస్యమట. అయితే కందుకూరు ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఇది ఆర్థికపరమైన అంశం గా పేర్కొంది. అయినా సరే కులాల మధ్య కుంపట్లు పెట్టాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కందుకూరుకు వచ్చేందుకు సిద్ధపడుతున్నారట. కేవలం కుల రాజకీయాలను తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారట. 2019 ఎన్నికల్లో ఇదే మాదిరిగా లబ్ధి పొందారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీసింది. తుని రైలు దగ్ధం ఘటన చోటుచేసుకుంది. అప్పటినుంచి టిడిపి ప్రభుత్వం పట్ల అసంతృప్తి ప్రారంభమైంది కాపు సామాజిక వర్గంలో. దానిని క్రమేపీ పెంచడంలో సక్సెస్ అయ్యింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా కాపులు కూటమి వైపు ఉండకుండా చేసేందుకు కందుకూరు ఘటనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధపడుతోందట. ముమ్మాటికి ఇది రాజకీయ క్రీనీడలో భాగంగా జరుగుతోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. బాధిత కుటుంబ సభ్యులకు భూమితో పాటు నష్టపరిహారం ప్రకటించారు. ఇంత జరిగాక జగన్మోహన్ రెడ్డి కందుకూరు వెళ్తే మాత్రం ఇబ్బందికరమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.