Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని ఎందుకు కనిపించడం లేదు? అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? యాక్టివ్ గా ఉండే ఆయన ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి నేతల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు పేర్ని నాని. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నమ్మకంగా నడిచే నేతల్లో ఈయన ఒకరు. అందుకే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు గుర్తింపు లభించింది. జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కీలక మంత్రి పదవి ఇచ్చారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో పేర్ని నాని బరిలో దిగలేదు. ఆయన కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోయారు. అప్పటినుంచి పేర్ని నాని కొంతవరకు సైలెంట్ గానే ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండేవారు. అయితే ఇటీవల బొత్తిగా కూడా కనిపించడం మానేశారు.
* బియ్యం పక్కదారి కేసు
ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. పౌరసరఫరాల శాఖకు ఒక గోదామును అద్దెకు ఇచ్చారు నాని. అయితే అందులో ఉండే రేషన్ బియ్యం లో భారీగా తరుగు కనిపించింది. విజిలెన్స్ విచారణలో కూడా ఇది తేలింది. అయితే ఆ గోదాము పేర్ని నాని భార్య పేరు మీద ఉంది. దీంతో ఆమెపై కేసు నమోదు అయింది. అప్పటినుంచి ఆ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే పేర్ని నాని మీడియాకు పెద్దగా కనిపించడం లేదు.
* అరెస్టు భయంతోనే
వాస్తవానికి ఈ కేసులో అరెస్టులు తప్పవని ప్రచారం నడిచింది. అప్పటినుంచి నాని కుటుంబం కనిపించడం లేదు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కానీ ఈ కేసు విచారణ 16కు వాయిదా పడింది. అయితే ఇంతలో అరెస్టు చేస్తారన్న భయంతోనే ఆ కుటుంబం పరారీలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్ని నానికి సన్నిహితుడు అన్న ప్రచారం నడుస్తోంది. ఆయనను మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పేర్ని నాని కుటుంబం కనిపించకపోవడం విస్తృత చర్చకు కారణమవుతోంది. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు ప్రచారం బలంగా నడుస్తోంది.