Gadikota Srikanth Reddy : జగన్ కు దూరంగా స్నేహితుడు.. రాజకీయాల నుంచి శాశ్వతంగా!

మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు ఒకరు పార్టీకి దూరమయ్యారు. ఆయన ప్రోద్బలంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో పదవులు దక్కకపోయేసరికి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : October 26, 2024 1:40 pm

Gadikota Srikanth Reddy

Follow us on

Gadikota Srikanth Reddy : వైసీపీ సీనియర్ నేత శ్రీకాంత్ రెడ్డి కనిపించడం లేదు ఎందుకు?వైసీపీకి గుడ్ బై చెబుతారా? లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి జగన్ వెంట పెద్దగా కనిపించడం లేదు. ఒకటి రెండు సార్లు కనిపించినా పెద్దగా యాక్టివ్ గా లేరు.అయితే అధినేత జగన్ తీరుతో విసిగి వేసారి ఆయన సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్ కు చిన్ననాటి స్నేహితుడు. మంచి వాగ్దాటి కలిగిన నేత. జగన్ ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి సమయంలో టికెట్ దక్కించుకున్నారు.అప్పటి నుంచి గెలుస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు సేవలు అందిస్తూ వచ్చారు. 2014లో వైసీపీ ఓడిపోయినా శ్రీకాంత్ రెడ్డి మాత్రం గెలిచారు. శాసనసభలో గట్టిగానే వాయిస్ వినిపించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచేసరికి తనకు మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ జగన్ హ్యాండ్ ఇచ్చారు. చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు. అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. రెండేళ్ల తర్వాత ఆ పదవి నుంచి కూడా తొలగించారు. ఎప్పుడైనా పార్టీకి అవసరం అన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టించి ఆయనతో మాట్లాడించారు. ఎన్నికలకు ముందు రాయచోటి టిక్కెట్ విషయంలో సైతం ఇబ్బంది పెట్టారు. సీఎం ఓలో కీలక అధికారైన ధనంజయ రెడ్డిని తెరపైకి తెచ్చారు. అయితే ఎలాగోలా అప్పట్లో టిక్కెట్ తెప్పించుకున్నారు శ్రీకాంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి వైసీపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు.

* అందరూ జగన్ ఆత్మీయులే
వైసిపి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా జగన్ ఆత్మీయులే అధికంగా ఉన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని, సామినేని ఉదయభాను, మోపిదేవి వెంకటరమణ వంటి సన్నిహిత నేతలే పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వారందరికీ ఏదో రూపంలో మంచి పదవులు ఇచ్చారు జగన్. కానీ గడికోట శ్రీకాంత్ రెడ్డి విషయంలో మాత్రం చాలా అన్యాయం చేశారు. స్నేహం మాటున మాట ఇచ్చి మరిచిపోయారని ఆయనలో ఆవేదన కనిపిస్తోంది.

* సమర్ధుడైన నేతగా
గడికోట శ్రీకాంత్ రెడ్డి మృదుస్వభావి. ఆయన మాటల్లో ఎక్కడ ఇబ్బందికర కామెంట్స్ రావు. చాలా పద్ధతిగా మాట్లాడుతారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే వైసిపి హయాంలో చాలామంది మంత్రులు పనిచేశారు. కనీసం వారికి సభా మర్యాదలు తెలియవు. కానీ శ్రీకాంత్ రెడ్డి చాలా హుందాగా నడుచుకున్నారు. సభా సాంప్రదాయాలు పాటించారు. కానీ ఆయన విషయంలో ఎందుకో జగన్ నిర్లక్ష్యం చేశారు. కనీసం విస్తరణ సమయంలోనైనా ఛాన్స్ ఇస్తారని భావించారు. పోనీ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ల నియామకంలో సైతం న్యాయం చేయలేదు. దీంతో ఆయన పునరాలోచనలో పడినట్లు సమాచారం. వైసీపీకి గుడ్ బై చెప్పడం కంటే.. రాజకీయాల నుంచి నిష్క్రమించడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.