YCP Second List: వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఎప్పటికీ 11 మంది అభ్యర్థులను మార్చి సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనాల్సి ఉండడంతో.. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి సంచలనాలను క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ తొలి జాబితా విడుదలైంది. రెండో జాబితా విడుదల లో జాప్యం జరిగింది. భారీ స్థాయిలో అభ్యర్థుల మార్పు ఉండడంతో సుదీర్ఘ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా వైఎస్ షర్మిల వల్లే రెండో జాబితా ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయమైంది. ఆమెకు పగ్గాలు ఇస్తే మాత్రం వైసిపి అసంతృప్త అభ్యర్థులు, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానని స్పష్టం చేశారు. ఇది ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి తో ఆగదు.. టిక్కెట్లు దక్కని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతారని టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగా రెండో జాబితా పై వైసిపి కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఈ జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, పురం, కడప జిల్లాలో ఈ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. తుది జాబితా ఈరోజు సాయంత్రం వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18, పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు బలంగా ఉన్న జిల్లాలు ఇవి. ఈ రెండు జిల్లాల్లో జనసేన బలపడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో… అభ్యర్థుల ఎంపికలో ఒకటికి రెండుసార్లు వైసిపి జాగ్రత్తలు తీసుకుంటుంది. గెలుపు అన్న తారక మంత్రంతోనే ముందుకు సాగుతోంది.
మార్పుల జాబితాలో తమ పేర్లు ఎక్కడ ఉంటాయోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. మార్పు ఖాయమని సంకేతాలు అందుకున్న నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. తమకు అవకాశం ఉంటుందన్న పార్టీల్లో చేరేందుకు చర్చలు ప్రారంభించారు. ఎక్కువమంది జనసేన వైపు చూస్తున్నారు. అక్కడ అవకాశం దొరికితే ఎమ్మెల్యేగా పోటీ.. లేకుంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే గౌరవ స్థానం వంటి విషయంలో భరోసా తీసుకుంటున్నారు. ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు జనసేనలో చేరడం ఖాయం అయ్యింది. అటు విశాఖలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరారు. ప్రస్తుతం జనసేన టచ్లోకి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వైసిపి జాబితాను ప్రకటిస్తే మాత్రం.. ఆ మరు క్షణం రాజకీయాలు మారే అవకాశం ఉంది. అయితే షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే.. జాబితాను వెల్లడించేందుకు వైసిపి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.