Amaravati- YCP: అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతోందా? హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తరువాత సుప్రీం కోర్టుకు వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇన్ని రోజులు తాత్సారం చేసి.. ఇప్పుడు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయడం ఏమిటి? ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లూ సుప్రీం కోర్టులో ప్రతికూల తీర్పు వస్తుందని భావించిన ఏపీ సర్కారు ఇప్పుడు ఉన్నపలంగా సవాల్ చేస్తూ పిటీషన్ వేయడం అందర్నీ ఆశ్చర్యకితులను చేసింది. వైసీపీ సర్కారుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తప్పదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కానీ వైసీపీ సర్కారు మాత్రం తమకు అనుకూలంగా తీర్పు వస్తోందని భావిస్తోంది. మార్చి 3 తేదీన అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. అమరావరతి రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే హక్కు అసెంబ్లీ లేదని కూడా స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఒప్పందం మేరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్ధేశించిన గడువులోగా రాజధానిని అభివృద్ధి చేయాలని కూడా ఆదేశించింది. రిట్ ఆఫ్ మాండమాస్ ఇస్తున్నట్టు కూడా తన తీర్పులో స్పష్టంగా చెప్పింది.

కావాలనే తాత్సారం…
అయితే హైకోర్టు నిర్ధిష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వంలో చలనం లేదు. అటు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటీషన్ వేయలేదు. హైకోర్టు ఇచ్చిన గడువు చాలదంటూ ఒకసారి, నిధులు లేవని ఒకసారి…ఇలా వరుసగా ఏపీ సర్కారు పిటీషన్లు వేస్తూ వస్తోంది. అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా ఇంతకు ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సైతం వెనక్కి తీసుకుంది. సీఆర్డీఏ చట్టాన్ని సైతం రద్దు చేసింది. రాజధానిలో కొన్ని కీలక నిర్మాణాలను అద్దెకు ఇచ్చి ఆదాయం పెంచుకోవాలన్న ప్రతిపాదనలు సైతం రూపొందించింది. మరో ముందడుగు వేసి రాజధాని భూములను రాష్ట్రంలో పేదల ఇళ్లకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. కానీ హైకోర్టు సీరియస్ గా ఇచ్చిన ఆదేశాలను అమలుచేయలేదు. తీర్పును గౌరవించలేదు. అడుగడుగునా న్యాయ ఉల్లంఘనకు పాల్పడుతూ వచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువుకు 47 రోజులు దాటిన తరువాత తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
న్యాయ వ్యవస్థపై దాడి…
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనలు పాటించడం లేదు. పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బాధితులు, బాధిత సంస్థలు కోర్టుకు వెళ్లి న్యాయం పొందుతున్నాయి. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. అయితే శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ చొరబడుతోందని వైసీపీ సర్కారు వింత వాదనకు తెరతీసింది. నేరుగా న్యాయ వ్యవస్థపై దాడిచేయడం ప్రారంభించింది. అమరావతి రాజధాని విషయంలో రిట్ ఆఫ్ మాండమాస్ ను జారీచేయడమంటే శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని వైసీపీ సర్కారు వాదిస్తోంది. చట్టాలుచేయడానికి శాసనవ్యవస్థకు రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించిందన్నారు. అలాంటప్పుడు శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ ఎందుకు ప్రవేశిస్తోందని వాదిస్తోంది. ఈ అంశంపై ఏకంగా అసెంబ్లీలో చర్చించారు. ఒక తీర్మానం తయారుచేసి మరీ ఆమోదించారు.

సీజేఐ మారిన తరువాత…
హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. తాజాగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. అయితే దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీకి చెందిన సీఐజే పదవీ విరమణ పొందిన నేపథ్యంలో పిటీషన్ దాఖలు చేయడం వెనుక అనుమానాలున్నాయి. ఆయన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పురాదన్న అనుమానాంతో ఇన్నాళ్లూ తాత్సారం చేస్తూ వచ్చారన్న వ్యాఖ్యలైతే వినిపించాయి. గత నెలలో ఆయన పదవీవిరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తి వచ్చారు. ఈ నేపథ్యంలో పిటీషన్ వేశారు. ఒక వేళ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇస్తే మాత్రం మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. చకచక రాజధానుల ఏర్పాటును ఫినిష్ చేస్తారు. అయితే ఎవరైనా హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని కొన్ని పిటీషన్లు ఇప్పటికే దాఖలయ్యాయి. ప్రభుత్వ తాజా పిటీషన్ విచారణపై కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది., అయితే తమకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని అమరావతి రైతులు ఆశాభావంగా ఉన్నారు. వైసీపీ సర్కారు మాత్రం ఆ పాత మొండి వైఖరితోనే ముందుకెళుతోంది.