YCP Rappa Rappa: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి వ్యతిరేకవర్గం అధికం. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. కానీ 40 శాతం ఓటు బ్యాంకు ను సొంతం చేసుకుంది. అయితే దానినే పట్టుకొని ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేలాడుతోంది. తమకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని.. దానికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే ఇట్టే గెలిచి తీరేస్తామని చెబుతోంది. అయితే 40 శాతం ఓట్లు సరే. అయితే ఒక్కో కూటమి ఎమ్మెల్యేకు భారీ స్థాయిలో మెజారిటీలు వచ్చాయి. పదివేల లోపు ఓట్ల మెజారిటీ వచ్చిన వారు చాలా తక్కువ. కొన్ని జిల్లాల్లో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా లేదు టిడిపి కూటమి అభ్యర్థులకు. కానీ ఎందుకో ఆ పార్టీ ఇంకా అతి ధీమాతో ఉంది. బహుశా ఆ ధీమాతోనే రఫ్ఫా రప్పా డైలాగులు చెబుతోంది. అయితే దానివల్ల ఆ పార్టీకి ప్లస్ కంటే మైనస్ అధికం. సాధారణంగా వైసీపీకి ప్రతికూలం కావడంతో టీడీపీ కూటమి దాన్ని హైలెట్ చేస్తోంది.
తటస్తులు హింసకు వ్యతిరేకం..
సమాజంలో హింసను ఎక్కువమంది వ్యతిరేకిస్తారు. ప్రశాంత జీవితానికి ఇష్టపడతారు. వైసిపి హయాంలో అలా జరగలేదు. రాజకీయాలతో సంబంధం లేని వారిని సైతం ఇబ్బంది పెట్టారు. డాక్టర్ సుధాకర్( Dr Sudhakar ) లాంటి వారిని ఇబ్బందికి గురిచేశారు. రహదారులపై సభలు సమావేశాలు పెట్టారు. ఎక్కడికైనా పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే జనజీవనానికి అవాంతరం కలిగేది. ఆపై తరచూ హింసాత్మక ఘటనలు జరిగేవి. నేతలు బూతు పదాలు ప్రయోగించేవారు. ఆపై హింస మాట ఎక్కువగా వారి నోట వినిపించేది. ఇవన్నీ ఆ పార్టీకి ప్రతికూలతలే. 2024 ఎన్నికల్లో ప్రభావం చూపినవే. అయినా సరే గుణపాఠాలు నేర్చుకోలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. చివరకు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఏకంగా ఆయన చిత్రపటం ముందు జంతు బలులు ఇచ్చారు. అయ్యప్ప స్వామి సన్నిధానంలో శరణు ఘోషకు బదులు జై జగన్ అనే మాట వినిపించింది.
అధినేత నుంచి కిందిస్థాయి వరకు..
తాము అధికారంలోకి వస్తే చూస్తాం మీ పరిస్థితి అని జగన్( Y S Jagan Mohan Reddy) హెచ్చరించారు అంటే.. దిగువ స్థాయి కేడర్ ఊరుకుంటుందా? అందుకే ఈ పుష్ప డైలాగులు, హెచ్చరికలు. వాస్తవంగా వైసిపి పై హింసముద్ర ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ అలా ఉండడం లేదు. ఇప్పటికీ అవేరకమైన హెచ్చరికలు. తాము వస్తే చూస్తాం అంటూ చేస్తున్న హెచ్చరికలు కూటమికి వరంగా మారుతున్నాయి. హింస సంస్కృతి కాదని.. వేధింపులు వద్దని.. చట్టం పని తాను చేసుకుని వెళుతుందని… ఇలా మాట్లాడుతున్నారు కూటమి నేతలు. దాన్ని ఫాలో అవుతున్నాయి టిడిపి కూటమి శ్రేణులు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పై మాత్రం ఆ ముద్ర పరోక్షంగా వెళుతోంది. ప్రజలు కూడా టిడిపి కూటమి నాయకత్వం మాటలు, వైసీపీ నాయకత్వం మాటల్లో ఉన్న తేడాను చూస్తున్నారు. ఈ హింసాత్మక హెచ్చరికలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే.