Bhogapuram Airport: దశాబ్ధాల కల.. ‘భోగాపురం’ ఎయిర్ పోర్ట్’కు ముందూ.. వెనుక.. ఏం జరిగింది?

ప్రస్తుతం అతి కష్టమ్మీద నిర్వాసితులను గ్రామాల నుంచి పంపించారు. 36 నెలల్లో లక్ష్యంగా పెట్టుకున్నా.. అది ఎన్నికల స్టంటేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : May 3, 2023 10:20 am
Follow us on

Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం.. దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. ఇప్పటికీ భూసేకరణకు మించి ఒక అడుగు ముందుకుపడలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. పూర్తిస్థాయి పరిహారం అందించలేదు. కానీ ముచ్చటగా రెండోసారి శంకుస్థాపనలకు సిద్ధపడుతుండడం మాత్రం నివ్వెరపరుస్తోంది. బుధవారం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ.4592 కోట్లతో నిర్మించనున్న ఎయిర్ పోర్టును 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థకు అప్పగించారు.

నాలుగేళ్ల కిందట శంకుస్థాపన..
అయితే ఈ ఎయిర్ పోర్టుకు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019ఫిబ్రవరి 15న చంద్రబాబు భూమిపూజ చేశారు. అదేరోజు విశాఖ కాపులుప్పాడలో రూ 70వేల కోట్లతో లక్ష మందికి ఉపాధి లక్ష్యంతో అదానీ డేటా సెంటర్ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో పతంజలి ఫుడ్ పార్క్ కు,  172ఎకరాల్లో విజయనగరం మెడికల్ కాలేజీకి, 129ఎకరాల్లో గురజాడ వర్సిటీకి శ్రీకారం చుట్టారు. అయితే ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. కానీ నాలుగేళ్లు పట్టించుకోని జగన్ సర్కారు.. ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి శంకుస్థాపనలకు దిగుతుండడం విమర్శలకు తావిస్తోంది.

నాడు విపక్ష నేతగా..
చంద్రబాబు సర్కారు 2,700 ఎకరాల్లో ఎయిర్ పోర్టును ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జగన్ సర్కారు దానాని ఇప్పుడు 2200ఎకరాలకు కుదించింది. వరల్డ్ బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ-380 కూడా ఈజీగా ల్యాండ్ అయ్యే విధంగా 3.8కిమీ రన్ వేకు అప్పట్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం విశాఖ  ఎయిర్ పోర్టు నేవీ ఆధ్వర్యంలో నడుస్తోంది, పార్కింగ్ స్పేస్ లేక వచ్చిన విమానం వచ్చినట్లే వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి..వీటన్నింటికీ పరిష్కారంలా భోగాపురంలో భారీ పార్కింగ్ స్పేస్ కు ప్లానింగ్ చేశారు, మెయింటెనెన్స్ వర్క్ షాప్ కూడా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ నిర్వాసితులను రెచ్చగొట్టారు. భూములు ఇవ్వొద్దని సూచించారు. తాను అధికారంలోకి వస్తే ఇచ్చిన భూములను వెనక్కి ఇస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, నష్టపరిహారం అందించకుండా శంకుస్థాపనలకు సిద్ధపడుతుండడం మాత్రం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది.

ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై ఫోకస్…
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై చంద్రబాబు సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆ 4ఏళ్లలోనే ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 4రెట్లు పెరిగింది. 1.3మిలియన్ నుంచి 5.5మిలియన్లకు పాసింజర్లు పెరిగారు, సిఏజిఆర్ 38% పెరిగింది..రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విశాఖపట్నం ఒక్కటే. దీంతో పాటు విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేశారు. అయితే విమానాల జంక్షన్ గా మార్చాలన్న ఉద్దేశ్యంతో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అడుగులు వేశారు. అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉండడంతో వడివడిగా అడుగులు పడ్డాయి. కానీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. ప్రస్తుతం అతి కష్టమ్మీద నిర్వాసితులను గ్రామాల నుంచి పంపించారు. 36 నెలల్లో లక్ష్యంగా పెట్టుకున్నా.. అది ఎన్నికల స్టంటేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.