Shock to Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా? తమంతట తాము బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? లేకుంటే అధికార పార్టీ ప్రలోభ పెడుతోందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం తాజాగా ఒక ప్రకటన చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశం లేదని తేల్చి చెప్పారు. చివరి వరకు తమ కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతుందని.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులమని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఉన్నపలంగా వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ మారడం లేదని చెప్పడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు టిడిపిలో చేరడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏడాది పాటు ఎదురుచూసిన వారు ఇప్పుడు చేరుతుండడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో బిజెపిలోకి ఒక ఎమ్మెల్సీ వెళ్లడం కూడా చర్చకు దారితీస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఏదో జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది.
సీనియర్లు తప్పించి..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఐదుగురు పార్టీలో సీనియర్లు. ఆపై జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) సొంత సామాజిక వర్గానికి చెందినవారు. మిగతా వారు మాత్రం కొత్తవారే. కూటమి ప్రభంజనాన్ని సైతం తట్టుకొని నిలబడ్డారు. అయితే వారు అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని ఎక్కువ మందికి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచి సభలో అడుగుపెట్టడం అనేది ప్రతి ఒక్కరి కల. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కోణంలో ఆలోచించి సభకు గైర్హాజరవుతున్నారు. అయితే వైసీపీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. అందులో ఎక్కువ మంది జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. దీంతో వారంతా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
మెజారిటీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ( assembly sessions )ఈనెల 18న ప్రారంభం అయ్యాయి. అదే రోజు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తో సమావేశం అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని తేల్చి చెప్పారు. సభకు హాజరైన మాట్లాడే అవకాశం ఇవ్వనందున.. మనం సభకు వెళ్లడం వృధా ప్రయాస అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బాహటంగానే వ్యాఖ్యానాలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. సభకు వెళితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించింది. అయితే సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారధ్యంలో మీరు సభకు వెళ్ళొచ్చని జగన్ ఎమ్మెల్యేలతో అన్నట్లు కూడా టాక్ నడిచింది. కానీ అందుకు పెద్దిరెడ్డి విముఖత చూపడంతో అక్కడితో ఆ చర్చ ఆగిపోయింది. జగన్ తిరిగి బెంగళూరు వెళ్ళిపోయారు.
అరకు ఎమ్మెల్యే పై అనుమానాలు..
ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల( medical colleges) అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. పాడేరు వైద్య కళాశాల విషయంలో కూడా ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు ఆందోళన చేపట్టారు. అయితే పక్కనే ఉన్న అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం మాత్రం హాజరు కాలేదు. ఆపై సీఎం చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్సీలు టిడిపిలో చేరారు. దీంతో రాజకీయంగా కూటమి సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డిని విభేదించి ఓ ఐదు, ఆరుగురు ఎమ్మెల్యేలు సభకు హాజరైతే ఇబ్బందుల్లో పెట్టవచ్చన్న ఆలోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖంగా అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం పేరు వినిపిస్తోంది. ఆయనతో పాటు ఓ ఐదుగురిని సభకు రప్పించి.. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని పలుచన చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.