YCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతల వైఖరి వింతగా ఉంది. వైసిపి హయాంలో చాలామంది నేతలు దూకుడుగా ఉండేవారు. సీనియర్లు మౌనంగా ఉండగా.. జూనియర్ లు విచ్చలవిడిగా మాట్లాడేవారు. నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అటువంటి వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. కేసుల పరంగా ఇబ్బందులు పడుతున్నారు. జైలుకు వెళ్లిన వారు ఉన్నారు. అయితే ఇలా జైలుకు వెళ్లిన క్రమంలో చాలా రోజులుగా రిమాండ్ ఖైదీలుగా ఉండిపోతున్నారు. అటువంటివారు బెయిల్ పై బయటకు వచ్చే క్రమంలో కూటమి ప్రభుత్వంపై దూకుడుగా మాట్లాడుతున్నారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వారి దూకుడు చూస్తే ఇక ప్రభుత్వంపై గట్టి పోరాటం చేస్తారని అనుకోవచ్చు. అటు తర్వాత వారు ఎందుకో సైలెంట్ అవుతున్నారు. కనీసం మాట్లాడడం లేదు కూడా. అయితే పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో వారికి సాయం దక్కకపోవడంతోనే వారు సైలెంట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
* తొలి అరెస్టు ఆయనదే
కూటమి( aliance) అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టు అయ్యారు. చాలా రోజులు పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరకు న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ దక్కింది. అయితే సురేష్ మాత్రం ప్రభుత్వం పై ఎటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. బయటకు మాట్లాడింది కూడా చాలా తక్కువ. అయితే అరెస్టు అయిన మిగతా నేతలు కంటే తన విషయంలో అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆయనలో ఉంది. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. అరెస్టయిన తన కుటుంబాన్ని పట్టించుకోలేదన్న ఆవేదన ఆయనలో కనిపించింది. అయితే నందిగాం సురేష్ విషయంలో జగన్ ఆలోచన వేరేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను పట్టించుకోలేదని అర్థమవుతోంది.
* హైదరాబాదులో వల్లభనేని వంశీ..
వల్లభనేని వంశీ మోహన్( Vamsi Mohan) చాలా రోజులు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో టిడిపి నుంచి గెలిచి ఆ పార్టీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై విరుచుకుపడ్డారు. అందుకోసమే ఆయనను వైసీపీలో చేర్పించుకున్నారు అన్న రీతిలో విమర్శలు చేసేవారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారు. జైలులో సుదీర్ఘకాలం రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆరోగ్యం కూడా ఇబ్బందుల్లో పడింది.. బెయిల్ పై బయటపడిన అనంతరం ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఇక గన్నవరంలో ఆయన యాక్టివ్ అవుతారని.. ప్రభుత్వంపై మునుపటి మాదిరిగా విరుచుకుపడతారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా అలానే ఉంది. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కేవలం మీడియా ముందు మాత్రమే ఆయన దూకుడుగా ఉంటున్నారు. మిగతా విషయాల్లో మాత్రం పెద్దగా చూసి చూడనట్టుగా ఉన్నారు.
* చెవిరెడ్డికి బెయిల్
తాజాగా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ( Bhaskar Reddy )బెయిల్ లభించింది. దీంతో మీడియా ముందుకు వచ్చిన ఆయన తాను జగన్ కోసమే ఇక్కడి నుంచి బతుకుతానని ప్రకటన చేశారు. గతంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఆయన బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. మునుపటి దూకుడు కూడా లేదు. మరోవైపు మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబులు తాము రెడ్ బుక్ కు భయపడలేదని చెబుతున్నారు. కానీ లోకేష్ మాత్రం రెడ్ బుక్ లో మూడు పేజీలు అయ్యాయని.. ఇంకా చాలా పేజీలు ఉన్నాయంటూ స్పష్టం చేశారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భయం పెంచుతోంది. జైలుకు వెళ్లిన వారు నోరు తెరవడం లేదు. అరెస్టుల భయంతో ఉన్నవారు సైలెంట్ గా ఉంటున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి ఒకరిద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జైలుకెళ్లి బయటకు వచ్చిన వారు నోరు తెరవడం లేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన సైలెన్స్ కనిపిస్తోంది.