Pithapuram: ఏపీలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. అక్కడ ఏ చిన్న పరిణామం జరిగినా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. చర్చకు దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటమే అందుకు కారణం. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ గెలవకూడదన్నది జగన్ అభిమతం. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ వైసీపీ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. అందుకే ఈసారి కూడా పవన్ ను ఓడించాలని వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మహిళా నేత వంగా గీతను బరిలో దించింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి రప్పించి ఆ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది.
అయితే ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు. గెలుపు ఒక్కటే కాదు భారీ మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు మెగాస్టార్ కుటుంబం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా జనసేన కీలక నాయకులు, జబర్దస్త్ నటులు, ఆపై సెలబ్రిటీలు పిఠాపురం ను జల్లెడ పడుతున్నారు. లక్ష మెజారిటీతో పవన్ ను గెలిపించేందుకు పరితపిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు పిఠాపురం ప్రజలను ఆందోళనలో నేడుతున్నాయి. తరచూ వివాదాస్పద ఘటనలు జరుగుతుండడంతో.. ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయోనని స్థానికల్లో భయం నెలకొంది.
తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ పిఠాపురంలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ పై వైసీపీ నేతలు దాడి చేశారు. రాళ్లు విసరడంతో జనసేన కార్యకర్తకు గాయమైంది.అయితే పవన్ ను ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ ముందుకెళ్తుండగా.. పవన్ కు సైతం అదే స్థాయిలో మద్దతు పెరుగుతోంది. పవన్ ను ఓడించాలని ముద్రగడ పద్మనాభం ప్రయత్నిస్తుండగా.. ఆయన కుమార్తె కాంతి శ్రీ ఏకంగా ఒక వీడియో విడుదల చేశారు. పవన్ విషయంలో ముద్రగడ చేస్తున్నది తప్పు అంటూ బయట పెట్టారు. తాను పవన్కే మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఎలాగైనా ఓడించాలన్న క్రమంలో వైసిపి అతిగా ప్రవర్తిస్తోంది. ఇప్పటికే రాయలసీమకు చెందిన అల్లరి మూకలు పిఠాపురం చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కు మద్దతుగా ప్రచారానికి వచ్చిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాన్వాయ్ ను.. వైసిపి టార్గెట్ చేసుకోవడం గమనార్హం. మున్ముందు ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన పిఠాపురం ప్రజల్లో కనిపిస్తోంది.