AP Elections 2024: మొన్నటి వరకు వై నాట్ 175 అని నినాదం బలంగా వినిపించింది. ఎట్టి పరిస్థితుల్లో సైతం కుప్పంలో కూడా గెలిచి తీరుతామని అధికార పార్టీ నుంచి ఒక సౌండ్ బలంగా వచ్చింది. అటు జగన్ లో సైతం అదే ధీమా కనిపించింది. అందుకే ఆయన చాలా సభల్లో నా ఈ..కూడా పీకలేరు అన్నారంటే ఆయనలో ఎంత ధీమా ఉండేదో తెలుస్తోంది. అటువంటి జగన్ లోనే ఇప్పుడు ధీమా సడలినట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు వైసీపీ శ్రేణులకు ధైర్యం నూరిపోస్తూ వస్తున్న జగన్.. సడన్ గా ఎన్నికలు సవ్యంగా జరుగుతాయని నమ్మకం లేదని చెప్పడం ద్వారా తనలో ఉన్న బేలతనాన్ని బయటపెట్టారు. ఎవరె న్ని కుట్రలు చేసినా ప్రజలు తన వెంటే ఉంటారని చెప్పుకొచ్చిన ఆయన.. అధికారులపై బదిలీ వేటు పడడంతో బెంబేలెత్తిపోయారు. అందరూ ఏకమవుతున్నారని ఆందోళన పడుతున్నారు. ఇది వైసీపీ శ్రేణులకు మింగుడు పడని విషయం.
గత ఎన్నికల మాదిరిగా జగన్ కు సంపూర్ణ సహకారం అందే పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు.గత ఎన్నికల్లో చంద్రబాబును అందరూ కలిసి రెక్కలు విరిచారు. ఊపిరాడకుండా చేశారు. ఇప్పుడు కూడా జగన్ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు. పొరుగున కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం నుంచి కూడా పలకరించేవారు లేరు. అటు కేంద్ర పెద్దలు సైతం కూటమికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇటువంటి సమయంలో జగన్ కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఏం జరిగితే అది జరుగుతుంది లే అన్నట్టు ఆయన ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో వ్యవస్థల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. పైగా రేపు మాకు బ్రేకింగ్ న్యూస్ ఉంటుందని టాక్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీలో జగన్ పని అయిపోయిందన్న ప్రచారం ఊపందుకుంటుంది. ఈ పరిణామాలన్నీ జగన్ లో కలవరానికి కారణం అవుతున్నాయి.
నిన్నటి వరకు తన వెంట ప్రజలు ఉన్నారని జగన్ బలంగా నమ్మారు. సంక్షేమ పథకాలే తమకు ఓట్లు తెచ్చి పెడతాయని భావించారు. కానీ వరుసగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది కసి మీద ఓటు వేశారు. ఎప్పుడు లక్షన్నర ఓట్లు దాటని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఐదు లక్షలకు చేరుకున్నాయి అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పోలింగ్ నాడు ఓటింగ్ శాతం పెరిగితే అంతిమంగా అది అధికార పార్టీకే నష్టం. భారీ పర్సంటేజ్ ఓటు పోల్ అయితే.. వైసీపీకి ప్రమాదం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రచారం తుది దశకు చేరుకుంది. కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి సైతం మద్దతు పెరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రత్యేక ప్రకటన ఇస్తారని తెలుస్తోంది. స్టార్ హీరోలు సైతం తమ అభిమానులకు కీలక సంకేతాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూటమికి పాజిటివ్ పెరుగుతోంది. ఈ పరిణామాల క్రమంలోనే జగన్ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయని నమ్మకం లేదని ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబుకు ఎదురైన పరిణామాలన్నీ ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్నారు. దీనిని గుర్తు చేసుకునే వైసీపీ శ్రేణులు తెగ భయపడిపోతున్నాయి.