YCP: ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కూటమి వెర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి మారింది. మధ్యలో షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంటోంది. అయితే వైసిపి నుంచి జగన్ ఒక్కరే ఒంటరి పోరు చేస్తున్నారు. ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే నాయకులు కనిపించడం లేదు. సినిమా రంగం నుంచి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. అదే కూటమి విషయానికి వచ్చేసరికి స్టార్ క్యాంపెయినర్లు భారీగా ఉన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణ, నాగబాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, వరుణ్ తేజ్, క్రికెటర్ అంబటి రాయుడు, జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శీను, రాకెట్ రాఘవ.. ఇలా ఒకరేమిటి.. స్టార్ క్యాంపైనర్ల జాబితా చాంతాడంత ఉంది.వైసీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్క జగనే కనిపిస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీకి స్టార్ క్యాంపైనర్ల లోటు ఉండేది కాదు. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, భార్య భారతి.. సినిమా రంగం నుంచి మోహన్ బాబు, పోసాని కృష్ణ మురళి, అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి.. చిన్నాచితకా నటులు సైతం క్యూ కట్టారు. ప్రచారంలోకి రానివారు వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేశారు.కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా రాని పరిస్థితి. కనీసం వారు ఎందుకు రారో కూడా వైసిపి నేతలకు తెలియడం లేదు.
అలీ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఆయన ప్రచారానికి వస్తారో లేదో తెలియదు. గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలు వారిని దూరం చేశాయి. మోహన్ బాబు కు కనీస ప్రాధాన్యత దక్కలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న అలీ కోరిక తీరలేదు. అలీ విషయంలో చాలా అన్యాయం జరిగింది. వైసిపి కోసం తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ స్నేహాన్ని అలి వదులుకున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ.. ఇలా ఎన్నెన్నో పదవులను ఊరించారు. చివరకు సలహాదారు పదవితో ముగించారు. మోహన్ బాబును ప్రచారానికి పిలిచేటంత పరిస్థితిని లేకుండా చేశారు. ఇది జగన్ స్వయంకృతాపమే. పైగా సినిమా రంగాన్ని ఇబ్బంది పెట్టినట్లు ఒక ఆరోపణ ఉంది. ఇవన్నీ వైసీపీని సినీ రంగం వ్యక్తుల నుంచి దూరం చేశాయి. ప్రస్తుతం వైసీపీ ప్రచార సభలు ఇండిపెండెంట్ మాదిరిగా కొనసాగుతున్నాయి. స్టార్ కళ కనిపించడం లేదు.