YCP: ఏపీలో ( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల సందడి ప్రారంభం కానుంది. తొలుత మున్సిపాలిటీ, తరువాత పంచాయతీలు, అటు తర్వాత ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించాలని లేఖలు కూడా రాశారు. అయితే మరోవైపు జనగణన పూర్తయిన తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలు సాధ్యమన్న వార్తలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. 80% స్థానిక సంస్థలు వైసీపీ చేతుల్లో ఉండడంతో వీలైనంత త్వరగా.. వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగేవి. ఈసారి మాత్రం ఈవీఎంల ద్వారా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
* అనేక రకాల అభ్యంతరాలు..
సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల( EVM machine) వినియోగంపై అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవీఎంలను మేనేజ్ చేసి బిజెపి దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తున్నాయన్న అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సైతం బ్యాలెట్ పత్రాల ద్వారా మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఈవీఎంల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ కమిషనర్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీతో సమావేశం అయ్యారు. ఈవీఎంల వినియోగంపై చర్చించారు. ఈవీఎంలతో ఎన్నిక అనేది కష్ట సాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
* సాధ్యమేనా?
రాష్ట్రంలో 1.36 లక్షల వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి వార్డుకు ఒక ఈవీఎంను వాడాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలు అనేవి విడతల వారీగా నిర్వహిస్తుంటారు. అందుకే ఈ ఎన్నికలకు ఎన్ని ఈవీఎంలు అవసరం అవుతాయి అన్న అంశంపై చర్చించారు. ఇతర రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకునేందుకు కూడా ఎంతవరకు అవకాశం ఉంది అనేది ఆరా తీశారు. ఇప్పటివరకు స్థానిక సంస్థల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం స్థానిక సంస్థల్లో కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించేలా ప్రోత్సహిస్తోంది. అయితే ఇప్పటికే మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే పులివెందులలో ఫలితం చూశాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే రిపీట్ అవుతుందని.. ఒకవేళ ఈవీఎంలు పెడితే దానిని సాకుగా చూపి ఎన్నికలు బహిష్కరించే అవకాశం ఉంది.