Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: శ్రీవారి దర్శనాల్లోనూ వైసీపీ సరికొత్త రికార్డు

YSRCP: శ్రీవారి దర్శనాల్లోనూ వైసీపీ సరికొత్త రికార్డు

YSRCP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిర్ణయాలను వేగంగా అమలు చేస్తోంది. అటు వైసీపీ సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సైతం పునః సమీక్షిస్తోంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్కడ నుంచే చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సమర్థవంతమైన అధికారిగా పేరు ఉన్న శ్యామలరావును ఈవోగా నియమించారు. దీంతో ఆయన భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఐదేళ్లుగా జరిగిన అవకతవకలపై సైతం ఫోకస్ పెట్టారు. వైసిపి మంత్రుల సిఫారసు లేఖలతో భారీగా విఐపి బ్రేక్ దర్శనాలు పొందిన ఘటనలు తాజాగా వెలుగు చూస్తుండడం విశేషం.

సాధారణంగా తిరుపతిలో వివిఐపి దర్శనాలకు ప్రత్యేక అవకాశం ఇస్తారు. ముఖ్యంగా మంత్రుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా అనుచర వర్గానికి బ్రేక్ దర్శనం కోసం ఇచ్చిన లేఖలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 12న నాలుగు తోమాల సేవ, ఆరు ప్రోటోకాల్ దర్శనాలు, 12 మందికి కళ్యాణోత్సవం, 52 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు, 74 మందికి ఆర్జిత సేవ, బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆర్కే రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్నప్పుడు 2021 నవంబర్ 30న కనీసం భక్తుల పేర్లు లేకుండా 20 మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలని లేఖ రాశారు. వీరి తరహాలోనే చిత్తూరు జిల్లాకు చెందిన నాటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు కీలక నేతలు రోజుకు పదుల సంఖ్యలో విఐపి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి.

వైసిపి హయాంలో మంత్రులతో పాటు ఎంపీలు స్వామి వారి దర్శనానికి క్యూ కట్టేవారు. భక్తితో చేస్తే అది సమ్మతమే. కానీ అధికార దర్పంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించేలా.. స్వామి వారి దర్శనానికి పోటీ పడటం మాత్రం విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా వైసిపి హయాంలో మంత్రులు రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నారాయణస్వామి, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, నాటి ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గోరంట్ల మాధవ్, బెల్లం చంద్రశేఖర్ వంటి వారు తరచూ పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చేవారిని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. 2022 ఆగస్టులో అయితే మంత్రి ఉషశ్రీ చరణ్ ఒకేసారి 50 మందితో శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 10సుప్రభాత సేవ టికెట్లు కూడా పొందారు.అదే నెల 18న మంత్రి రోజా 30 మందితో విఐపి బ్రేక్ దర్శనం చేసుకున్నారు.ఇలా సామాన్య భక్తులకు ఇక్కట్లు కలిగిస్తూ వైసిపి మంత్రులు, ఎంపీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ప్రస్తుతం ఇవే అంశాలు బయటపడుతుండడంతో వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular