NDA – YS Jagan : ఎన్డీఏలో వైసీపీ చేరబోతోందా? ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. నిజంగా వైసీపీ చేరుతోందా? లేక ఉద్దేశపూర్వకంగా లీకులిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏపీలో ఎన్నికలకు ఏడాది వ్యవధి ఉంది. కానీ సీఎం జగన్ ముందస్తుకు వెళుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఢిల్లీ పెద్దలతో రహస్యంగా భేటీ అవుతున్నారు. ముందస్తుతో పాటు టీడీపీ, జనసేన వైపు బీజేపీ వెళ్లకుండా కట్టడి చేయడానికేనన్న టాక్ వినిపిస్తోంది. అవసరమైతే ఎన్డీఏలో వైసీపీ చేరుతుందని ఆయన బీజేపీ పెద్దలకు గట్టి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ పొలిటికల్ కార్నల్ లో నిలబడింది. అటు టీడీపీ, జనసేన వైపు వెళ్లాలా? లేకుంటే వైసీపీకి ఇంటర్నల్ గా సపోర్టు చేయాలా? లేకుంటే తటస్థంగా ఉండాలా? అన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది.ప్రస్తుతం ఎన్డీఏ మిత్రపక్షాల కోసం వెదుక్కుంటోంది. ఎన్డీఏలో ఇప్పుడు సీట్లు సాధించే కెపాసిటీ ఉన్న మిత్రపక్షాలు ఏమీ లేవు. శివసేన, అకాలీదళ్, జేడీయూ లాంటి పార్టీలన్నీ దూరమయ్యాయి. శివసేన , జేడీయూ కలసి వచ్చే అవకాశం లేదు. వస్తే దక్షిణాది నుంచే మిత్రపక్షాలను కలుపుకోవాలి. చంద్రబాబు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా గత అనుభవాలతో బీజేపీ ఆలోచిస్తోంది. నమ్మదగిన మిత్రుడు జగనేనని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
నీతి ఆయోగ్ సమావేశానికి అంటూ జగన్ ఢిల్లీ వెళ్లారు. ముందురోజే ప్రత్యేక విమానంలో వాలిపోయారు. మూడు రోజులపాటు బిజీబిజీగా గడిపారు. చాలా రహస్య సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ పెద్దలను కలిశారని ఎన్డీఏలోకి మళ్లీ టీడీపీని ఆహ్వానించవద్దని.. తమ పార్టీనే ఎన్డీఏలో చేరుతుందని బీజేపీ పెద్దలకు ఆయన హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ టీడీపీ ఎన్డీఏ లో చేరితే ఎదురయ్యే అనుభవాలు జగన్ కు తెలుసు. అందుకే ఎదురెళ్లి మరీ ఆఫర్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
జగన్ పెట్టిన ప్రతిపాదన విషయంలో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. అటు జగన్ సైతం లోలోపల బాధపడుతునే బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్నారు. గ్రౌండ్ లెవల్ లో వైసీపీ, జనసేన ఒక్కటేనన్న భావన ప్రజల్లో ఉంది. అది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్పుటమైంది. అటువంటిది నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అన్న భయం సైతం జగన్ ను వెంటాడుతోంది. అందుకే కేబినెట్ లో విస్తృతంగా చర్చించి దీనిపై ఒక డిసైడ్ కు వస్తారని సమాచారం.