Jagan: ఏపీ రాజకీయాలు వ్యక్తిగత వైరంగా మారిపోయాయి. ముఖ్యంగా వైయస్సార్ కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ వర్సెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. అయితే షర్మిల తన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి తనను నష్టం చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు.రాజకీయంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా అండగా నిలబడితే సోదరుడు జగన్ తనను మోసం చేశాడని షర్మిల ఆరోపిస్తున్నారు. తల్లి విజయమ్మ మాత్రం కుమార్తె షర్మిలకు అండగా నిలబడుతున్నారు. అయితే ఈ తరుణంలో రాజకీయంగా ఏకాకిగా మిగిలిపోయారు జగన్. గతంలో కేంద్రంలోని బిజెపి అన్ని విధాలుగా అండగా ఉండేది. కానీ కేంద్రంలో ఉన్న బిజెపికి తెలుగుదేశం దగ్గర కావడంతో.. జగన్ దూరం కావాల్సి వచ్చింది. అయినా సరే బిజెపి విషయంలో సానుకూల ధోరణితో ముందుకు సాగుతున్నారు జగన్. అయితే కేంద్రంలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ కావడం, కేంద్ర పెద్దలు చంద్రబాబును దగ్గర తీసుకోవడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోనే ఇండియా కూటమి వైపు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి సందిగ్ధ సమయంలో జగన్ కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగడం విశేషం. కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని తిరస్కరించారు. పైగా వ్యతిరేక సంకేతాలు పంపారు.దీంతో జగన్ విషయంలో బిజెపి ఆలోచన మారే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
* ఆ బిల్లుకు వ్యతిరేకం
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైసిపి ప్రకటించింది. ముస్లిం హక్కులను, మనోభావాలను కాలరాశి చట్టాలకు తమ మద్దతు ఉండదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించారు వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి. ముస్లిం సమాజానికి ఎల్లవేళలా అండగా ఉండి తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. అందుకే ఆ బిల్లుకు తాము వ్యతిరేకమని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తొలిసారి ప్రత్యక్షంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి తన నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో స్పీకర్ ఎన్నిక సమయంలో అడుగకుండానే బిజెపికి మద్దతు తెలిపింది వైసిపి. గత ఐదేళ్లుగా రాజ్యసభ తో పాటు లోక్సభలో బిజెపి ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును సమర్థిస్తూ వస్తోంది వైసిపి.ఎన్నికల అనంతరం కూడా సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాహటంగానే ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. దీంతో వైసిపి విషయంలో కేంద్రం ఆలోచన మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* అప్పట్లో పరస్పర సహకారం
గత ఐదేళ్లలో చాలా విషయాల్లో వైసీపీకి సహకరించింది కేంద్రం. అప్పట్లో చంద్రబాబుపై ఉన్న కోపంతో ప్రత్యర్థిగా ఉన్న జగన్ కు అండగా నిలిచారు కేంద్ర పెద్దలు. జగన్ పై సిబిఐ కేసులు, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాల్లో కేంద్రం సహకారం బాగానే అందింది. అప్పట్లో చంద్రబాబుపై కేసుల విషయంలో సైతం కేంద్ర పెద్దల సాయం ఉందన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు కేంద్రం విన్నపాన్ని వైసీపీ తిరస్కరించడమే కాదు.. వ్యతిరేకిస్తుండడంతో పాత కేసులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టిడిపి కూటమి ప్రభుత్వం వైసీపీ పై దూకుడుగా ఉంది. దీనికి కేంద్రం సహకారం తోడు కానుంది. అదే జరిగితే జగన్ ఏరి కోరి ఇబ్బందులు తెచ్చుకున్నట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.