Posani krishnamurali : తిరుమలలో వివాదం నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు లడ్డు వివాదం పుణ్యమా అని ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రభుత్వం పై విమర్శలు చేయడం ప్రారంభించారు. తాజాగా పోసాని కృష్ణ మురళి హాట్ కామెంట్స్ చేశారు. లడ్డు వివాదం పై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హత్య చేస్తారో అని అనుమానం వచ్చేలా మాట్లాడారు. జగన్ కు పోసాని హాట్ కోర్ ఫ్యాన్. గత ఐదేళ్లుగా ఈగ వాలనిచ్చేవారు కాదు. అయితే వైసిపి ఓటమితో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇన్నాళ్లకు తిరిగి వచ్చారు. వస్తూ వస్తూనే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనలో ఇంకా ఫైర్ తగ్గలేదని నిరూపించారు. తనకు గురువు జగన్ అని అభివర్ణించారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబుకు తగిన శాస్తి జరుగుతుందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పాలన కోసమేనని.. ప్రతికార రాజకీయాల కోసం కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కొత్తగా డిక్లరేషన్ అంటూ నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా మంచి పాలన అందించాలని.. ప్రతీకార రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన పోసాని తనలో ఉన్న పాత ధోరణిని బయట పెట్టుకున్నారు.
* వైసిపి ఆవిర్భావం నుంచి సేవలు
వైసీపీ ఆవిర్భావం నుంచి పోసాని కృష్ణ మురళి జగన్ వెంట అడుగులు వేశారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో జగన్ పోసాని సేవలను గుర్తించారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. అయితే చలనచిత్ర అభివృద్ధికి సంబంధించి పోస్ట్ తీసుకున్న పోసాని.. రాజకీయ విమర్శలకు ఎక్కువగా పరిమితమయ్యేవారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసుకునేవారు. ఒకానొక దశలో వారిపై తిట్ల దండకం పూనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
* పవన్ ను టార్గెట్
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై పోసాని కృష్ణమురళి చాలాసార్లు మాట్లాడారు. చివరకు మెగా కుటుంబం పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జనసైనికులు పోసాని ఇంటిపై దాడి చేశారు. దీంతో కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు పోసాని. మళ్లీ యధావిధిగా విమర్శలు ప్రారంభించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పోసాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనకున్న నామినేటెడ్ పదవికి సైతం రాజీనామా చేయలేదు. అయితే తాజాగా లడ్డు వివాదం నేపథ్యంలో మరోసారి తెర పైకి వచ్చారు. మళ్లీ పాత పద్ధతిలోనే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని మరిచి తీవ్రస్థాయిలో తూలనాడుతూ మాట్లాడారు. దీంతో టీడీపీ శ్రేణులు పోసాని కృష్ణ మురళి తీరుపై గుర్రుగా ఉన్నాయి.
* వ్యూహాత్మకంగా వైసిపి అడుగులు
అయితే లడ్డు వివాదం నేపథ్యంలో వైసీపీ ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటివరకు ఈ వివాదంపై టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్లు మాత్రమే మాట్లాడారు. కానీ ఈసారి వైసీపీ నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కొడాలి నాని, ఆర్కే రోజా, తమ్మినేని సీతారాం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇప్పుడు పోసాని కృష్ణ మురళి.. ఇలా వివాదాస్పద నేతలంతా ముందుకు వచ్చి మాట్లాడుతుండడం విశేషం. ఈ వ్యవహారంలో వెనుకబడ్డామని వైసిపి భావిస్తున్నందునే.. వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. మరి టిడిపి కూటమి పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More