YCP Digital Book: ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి వేధింపులు తప్పడం లేదు. గతంలో తమిళనాడులో ఈ తరహా సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు అది ఏపీకి పాకింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపికి వేధింపులు తప్పలేదు. ఇప్పుడు టిడిపి కూటమే అధికారంలో ఉండడంతో వైసీపీకి తప్పడం లేదు. ఈ తరుణంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ప్రతిపక్ష పార్టీలు చేయని ప్రయత్నం అంటూ లేదు. గతంలో లోకేష్ తన పార్టీ కార్యకర్తల కోసం రెడ్ బుక్ రాశారు. ఇప్పుడు అదే అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రావడంతో డిజిటల్ బుక్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. కానీ ఈ డిజిటల్ బుక్ వికటిస్తోంది. అదే డిజిటల్ బుక్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటికి మొన్న మాజీ మంత్రి విడదల రజిని తనను మోసం చేశారంటూ ఒక వ్యక్తి డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే తిప్పే స్వామి పై ఇదే తరహా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇది వికటిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆందోళనతో ఉంది.
* నాడు రెడ్ బుక్
రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ పాదయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఎదురైన ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా తాను రెడ్బుక్ రాస్తున్నానని.. టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టే నేతలు, అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ప్రకారమే నేతల అరెస్టు జరుగుతోందని.. వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. క్యాడర్ కోరుకున్నట్టు తగ్గట్టు డిజిటల్ బుక్ ను గ్రాండ్ గా ఓపెన్ చేశారు. అయితే అందులో ఏం ఫిర్యాదులు వస్తున్నాయో తెలియదు కానీ.. సొంత పార్టీ శ్రేణులు మాత్రం ఫిర్యాదులు చేస్తుండడం ఆందోళనకు దారితీస్తోంది.
* ఫిర్యాదుల వెల్లువ..
మొన్నటికి మొన్న మాజీ మంత్రి రజినిపై సొంత పార్టీ శ్రేణులే ఫిర్యాదు చేశారు. తాజాగా మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పే స్వామి పై సొంత పార్టీ వారి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానంటూ తల నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నారని కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రం ఆరోపణలు చేస్తూ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తన దగ్గర రూ.75000 తీసుకున్నారంటూ మరో వ్యక్తి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అయితే ఇలా డిజిటల్ బుక్ రివర్స్ అవుతుండడంతో తలలు పట్టుకుంటుంది వైసీపీ నాయకత్వం.