YCP Coverts: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ హవా నడిచింది. జనసేనతో పాటు బిజెపితో పొత్తు చాలా రకాలుగా కలిసి వచ్చింది. రాయలసీమలోనూ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. కడప లాంటి జిల్లాలో సైతం టిడిపి హవా స్పష్టంగా కనిపించడం విశేషం. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఈసారి చెక్ పెడుతూ టిడిపి సత్తా చాటింది. కానీ ఈ అరుదైన అవకాశాన్ని కొనసాగించే ఛాన్స్ చేజారిపోయినట్టు కనిపిస్తోంది. టిడిపిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవర్టు లు అధికమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు, తరువాత చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అలా చేరిన వైసీపీ నేతలపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలానే కొనసాగితే మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరమే.
* కడపలో సీన్ రివర్స్..
ఉమ్మడి కడప( Kadapa district ) జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను ఏడింట తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తట్టుకుని గెలవడం ఆశామాషి కాదు. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. 2019లో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అటువంటి చోట 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. 10 సీట్లకు గాను ఏడు చోట్ల విజయం సాధించింది. అయితే ఆ పట్టు నిలుపుకునేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన చాలామంది నేతల తీరుతో పరిస్థితి చేయి జారిపోతోంది. చాలామంది నేతల అవినీతి రోజురోజుకు పెరుగుతోంది. దాని ప్రభావం స్పష్టంగా వచ్చే ఎన్నికలపై పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* ఆ నాలుగు నియోజకవర్గాల్లో..
ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి( Rayachoti), మదనపల్లి, తంబళ్లపల్లె, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసిపి కోవర్టులు అధికంగా ఉన్నారు. వారు ఇప్పుడు పార్టీకి చేటు తెస్తున్నారు. ఒకవైపు టిడిపిని బలహీనపరచడం ఒక ఎత్తు అయితే.. అవినీతి పనులు చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలన్నది వీరి ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. వ్యాపారాలు రిత్యా కొందరు, వైసీపీ హయాంలో చేసిన తప్పిదాలకు ఇబ్బందులు వస్తాయని మరికొందరు టిడిపి గూటికి చేరారు. వారికి పార్టీ సిద్ధాంతాలపై కానీ.. పార్టీపై కానీ మంచి అభిప్రాయం లేదు. అటువంటి వారితో పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ హై కమాండ్ చక్కదిద్దకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. చూడాలి టీడీపీ హై కమాండ్ ఎలాంటి యాక్షన్ లోకి దిగబోతుందో..