YCP close in Nellore: రాజకీయాలు స్థిరంగా ఉండవు. గెలుపు ఓటములు కూడా సహజమే. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించింది కాంగ్రెస్ పార్టీ( Congress Party). ప్రస్తుతం ఆ పార్టీ ఆనవాళ్లు లేకుండా పోయింది. అంతెందుకు 2024 వరకు పాలించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు చాలా జిల్లాల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న జిల్లాలో సైతం ప్రతికూలతలు తప్పడం లేదు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పట్టుకొమ్మలు. అయితే ఒక్కొక్కటి విరుగుపడుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితికి వచ్చింది.
వైసీపీకి పెట్టని కోట..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ఆ పార్టీకి పెట్టని కోట. 2014 ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించింది. 2019లో సైతం స్వీప్ చేయగలిగింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. అది మొదలు ఆ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ జిల్లాకు చెందిన వైసిపి నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పడంతో.. వైసిపి పరిస్థితి దారుణాతి దారుణంగా మారింది. ఇదే అదునుగా అక్కడ పట్టు బిగించేందుకు టిడిపి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నేతలంతా.. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుంటారు.
కార్పొరేషన్ పై గురి..
తాజాగా నెల్లూరు కార్పొరేషన్ ( Nellore Corporation)పీఠంపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎలాగైనా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. 56 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్ లో వైయస్సార్సీపి క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత దాదాపు 45 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే, మంత్రి నారాయణ పావులు కదుపుతున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ల బలం టిడిపికి ఉండడంతో.. వైసిపి మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. తద్వారా నెల్లూరులో వైసిపి ని క్లోజ్ చేయాలని చూస్తున్నారు.
చేజేతులా తప్పిదాలు
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) నెల్లూరు విషయంలో చేజేతులా తప్పు చేశారు. ఇక్కడ బలమైన పునాదులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి కోసం బలంగా పనిచేసే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలు ఉండేవారు. వారిని చేజేతులా వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. పైగా దారుణంగా అవమానించి పంపించారు. అందుకే వారు ప్రత్యేకమైన పంతంతోనే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతు తేల్చేందుకు సిద్ధపడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమైన వైసీపీ పరాభవం.. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పీఠం దక్కించుకోవడం ద్వారా పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నారు.