Anaparthi Constituency: ఏపీలో పొత్తుల్లో కీలక ట్విస్ట్. టిడిపి ప్రకటించిన నియోజకవర్గాల్లో సైతం ఇప్పుడు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అంతటా గందరగోళం నెలకొంది. ఇది వైసీపీతో బిజెపి చేసుకున్న లోపాయికారీ ఒప్పందంగా బాధిత టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ప్రకటన తర్వాత.. బిజెపికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనపర్తి, అరకు అసెంబ్లీ స్థానాలకు టిడిపి అభ్యర్థులు ఖరారయ్యారు. అధికారికంగా వారి పేర్లను కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ రెండు స్థానాలను బిజెపికి కేటాయించారు. దీంతో టిడిపి అభ్యర్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వైసీపీకి గెలిపించేందుకు బిజెపి ఈ ఎత్తుగడవేసిందని ఆరోపణలు చేస్తున్నారు.
బిజెపి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పదిమంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో అనపర్తి ఉంది. శివ కృష్ణంరాజు పేరును ఖరారు చేసింది. దీంతో ఇప్పటికే టిడిపి అభ్యర్థిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. అనుచర వర్గంతో సమావేశమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతున్న వేళ.. ఇలా మార్పు ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలకు సమావేశంలో కన్నీటి పర్యంతమై మాట్లాడారు. దీంతో కోపోద్రిక్తులైన టిడిపి శ్రేణులు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఒక నిర్ణయం తీసుకుంటానని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్న సోము వీర్రాజుకు ఛాన్స్ లేకుండా పోయింది. ఈ తరుణంలో సోము వీర్రాజును అనపర్తి నుంచి పోటీ చేయాలని సూచించారు. కానీ అక్కడ బిజెపికి అంత బలం లేదు. దీంతో టీడీపీ శ్రేణులు సహకరిస్తాయా? లేదా? అన్నది ఒక అనుమానంగా ఉంది. పోటీ చేసి అభాసుపాలు కావడం కంటే పోటీ చేయకపోవడమే ఉత్తమమని సోము వీర్రాజు భావించినట్లు సమాచారం. అయితే ఇంతలో శివకృష్ణ రాజు పేరును బిజెపి ప్రకటించింది. అయితే టిడిపి గెలవాల్సిన సీటులో బిజెపిని నిలబెడుతున్నారని.. ఇది వైసిపి కోసం వేసిన ఎత్తుగడ అని.. ఇందులో కొందరు బిజెపి నాయకుల హస్తం ఉందని టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి. వైసీపీ కోసం చాలామంది బిజెపి నేతలు పని చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అనపర్తి సీటు మార్పు విషయంలో సైతం వారే చక్రం తిప్పారన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి లోలోపల ఏం జరిగిందో తెలియాలి.