Vallabhaneni vs Yarlagadda: గన్నవరం.. ఈ నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో గుర్తింపు ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి పెద్ద నాయకులు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.టిడిపి ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ హవా పెరిగింది. గత రెండు ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ మోహన్ గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టిడిపి అభ్యర్థిగా మారారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. వాస్తవానికి వంశీ మోహన్ వైసీపీలోకి వెళ్లిపోవడంతో టీడీపీకి నాయకత్వం లేదని భావించారు. కానీ వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు చేరడంతో సీన్ మారింది. వంశీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. గతం మాదిరిగా వంశీ దూకుడు తగ్గించారు.
వాస్తవానికి ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తారా? లేదా? అన్న చర్చ నడిచింది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. వంశీకి ఆ సామాజిక వర్గం వెలివేసినంత పని చేసింది. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబం పై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం కమ్మ సామాజిక వర్గం పై ప్రభావం చూపింది. వంశీ మోహన్ క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వంశీని ఓడించేందుకు కమ్మ సామాజిక వర్గం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు ఆ సామాజిక వర్గం అండగా నిలబడుతోంది. ఆయన గెలుపు కోసం గట్టిగానే శ్రమిస్తోంది.
తెలుగుదేశం పార్టీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు ఆ పార్టీ క్యాడర్ సంపూర్ణంగా సహకరిస్తోంది. వంశీ పై ఉన్న కోపంతో చాలామంది కసిగా పనిచేస్తున్నారు. అదే సమయంలో వైసీపీలోకి వెళ్లిన వంశీ మోహన్ కు ఆ పార్టీ శ్రేణులు పెద్దగా సహకరించడం లేదు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వంశీ మోహన్ వైసీపీ శ్రేణులకు తెగ ఇబ్బంది పెట్టారు. పైగా అక్కడ దుట్టా రామచంద్ర రావు రూపంలో అసమ్మతి ఉంది. ఆయన కచ్చితంగా వంశీ ఓటమి కోసం కృషి చేస్తారని ప్రచారం జరుగుతోంది. దుట్టా రామచంద్ర రావు టార్గెట్ చేసుకొని చాలాసార్లు వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చాలా చులకన చేసి మాట్లాడారు. ఇవన్నీ దుట్టా మైండ్ లో ఉన్నాయి. అందుకే వంశి అంటేనే రామచందర్రావు రుస రుసలాడుతున్నారు. సీఎం జగన్ రాజీ చేసే ప్రయత్నం చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం వారు కలవలేదు.
గన్నవరంలో నాలుగు మండలాలు ఉన్నాయి. ఉంగటూరు, గన్నవరం, బాపులపాడుతో పాటు విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలు గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. అన్ని మండలాల్లో యార్లగడ్డ వెంకట్రావు పర్యటన పూర్తి చేశారు. టిడిపి, కమ్మ సామాజిక వర్గం సంపూర్ణ సహకారం అందిస్తోంది. అదే సమయంలో వైసీపీలోని వల్లభనేని వంశీ వ్యతిరేకులంతా పరోక్ష మద్దతు తెలుపుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వంశీ గెలిచింది కేవలం 3500 ఓట్లతోనే. దీంతో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, వల్లభనేని వంశీ పై అసంతృప్తి వంటి కారణాలతో ఆయన ఎదురీదుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావు పట్టు బిగిస్తున్నారు. మరి ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.