Yanamala vs Chintakayala: తెలుగుదేశం ( Telugu Desam) పార్టీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభమైంది. మరో ఆరు నెలల్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగు సీట్లు కూడా టిడిపి కూటమికి దక్కుతాయి. దీంతో టిడిపి తో పాటు మిగతా రెండు పార్టీల్లో కూడా ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆశావహుల జాబితా కూడా ఎక్కువగా ఉంది. అయితే ఎవరికి దక్కుతాయో పదవులు అన్న చర్చ నడుస్తోంది. నాలుగింటిలో రెండు టిడిపికి.. బిజెపి, జనసేనకు చెరో ఒకటి లభిస్తాయని ప్రచారం నడుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్లు, జూనియర్ల మధ్య గట్టి పోటీ ఉంది.
నలుగురి పదవి విరమణ..
2026 జూన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్( Subhash Chandra Bose) , ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని… తెలుగుదేశం పార్టీకి చెందిన సాన సతీష్ పదవీకాలం పూర్తి కానుంది. వీరి స్థానంలో కొత్త వారి ఎంపిక జరగనుంది. అయితే కూటమికి ఏకపక్ష బలం ఉంది. అందుకే కూటమి నుంచి ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కానున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి రెండు పదవులు.. బిజెపికి ఒకటి.. జనసేన కి ఒకటి కేటాయించే అవకాశం ఉంది. అయితే సానా సతీష్ ఎన్నికై తక్కువ కాలమే అవుతుంది. కూటమి పెద్దలకు కావాల్సిన నేత కావడంతో ఆయనకు మరోసారి ఛాన్స్ ఇస్తారు. ఇక టిడిపికి మిగిలింది ఒకటే ఒక రాజ్యసభ స్థానం ఉంటుంది. దానికి విపరీతమైన పోటీ నెలకొంది.
పెద్దల సభకు వెళ్లాలని..
పెద్దల సభకు వెళ్లాలని ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు( ramakrishnaudu ). రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, పబ్లిక్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా, శాసనసభ స్పీకర్ గా, ఎమ్మెల్సీగా.. ఇలా అన్ని రకాల పదవులు అనుభవించారు. కానీ పార్లమెంటులో అడుగు పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. అందుకే ఆయన రాజ్యసభ పదవి కోరుకుంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వస్తోంది. కానీ ఈసారి పరిగణలోకి తీసుకోలేదు. అందుకే ఆయన తప్పకుండా రాజ్యసభ పదవికి ఎంపిక చేస్తారని ప్రచారం నడుస్తోంది.
తెరపైకి విజయ్ పేరు..
మరోవైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం శాసనసభ స్పీకర్ గా ఉన్నారు అయ్యన్నపాత్రుడు. రాజకీయంగా చాలా దూకుడు కలిగిన నేత. తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడు. అయితే అయ్యన్నపాత్రుడుకు మించి దూకుడుగా ఉంటారు విజయ్. గతంలో ఐ టీడీపీకి విశేష సేవలు అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది కూడా. అయితే ఎక్కడ వెనక్కి తగ్గరు. అటువంటి యువనేతను రాజ్యసభకు పంపించి ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి విజయ్ పోటీ చేసే అవకాశం ఉంది. కానీ అంతకుముందే రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. మొత్తానికి అయితే టిడిపిలో రాజ్యసభ పదవికి యనమల వర్సెస్ చింతకాయల అన్నట్టు పరిస్థితి మారింది.