Jagan: నేను కోర్టుకు రాను.. ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుంది. ఈ మాట చెబుతోంది ఎవరో తెలుసా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). అక్రమాస్తుల కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్లి వచ్చారు. ఇలా వెళ్లే క్రమంలో సిబిఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. ఆ సమయంలోనే కోర్టు విదేశాల నుంచి వచ్చిన వెంటనే.. కోర్టుకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన ఆయన కోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను వస్తే ప్రోటోకాల్ ప్రకారం చాలా రకాల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని.. అది ప్రభుత్వానికి భారం అని.. అందుకే తనను వీడియో కాన్ఫరెన్స్ లో విచారించాలని ఆ పిటిషన్ వేశారు. ఒక విధంగా చెప్పాలంటే కోర్టుకు హాజరు కానని.. అదే కోర్టుకు చెప్పడం నిజంగా విడ్డూరమే. అయితే గత 12 సంవత్సరాలుగా బెయిల్ పై ఉన్న ఒక నిందితుడు అంతకంటే ఏం మాట్లాడతాడు. కనీసం ఆ కేసులు ఎంతవరకు వచ్చాయో తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియదు.
Also Read: బీహార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా చంద్రబాబు.. కారణం అదే!
* 12 సంవత్సరాలుగా బెయిల్ పై..
అక్రమ ఆస్తుల కేసుల్లో 12 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు. అది మొదలు 2019లో ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతి శుక్రవారం కోర్టులో హాజరయ్యేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనాపరమైన విధుల్లో బిజీగా ఉండడం వల్ల తాను కోర్టుకు హాజరు కాలేనని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడు కోర్టు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. నేను రాలేను అంటూ పిటిషన్ దాఖలు చేయడం మాత్రం నిజంగా సాహసమే. ఒక విధంగా చెప్పాలంటే చట్టంతో ఆడుకోవడమే. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగడమే.
* పోలీసులు వద్దంటున్నా..
ఒకవైపు జగన్ బయటకు వస్తే శాంతిభద్రతల( law and order) సమస్యలు తలెత్తుతున్నాయని పోలీస్ శాఖ చెబుతోంది. ఆంక్షలతో పాటు షరతులు విధిస్తోంది. అయినా జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడం లేదు. జనం మధ్యకు వస్తున్నారు. అయితే అది జనం సమస్యల కోసం కాదు. వివిధ కేసుల్లో అరెస్టయిన వారి పరామర్శలకు.. జైల్లో ఉన్న వారిని పరామర్శించేందుకు వస్తున్నారు. వద్దు బాబు మేము భద్రత కల్పించలేమని పోలీసులు చెబుతున్నా వినడం లేదు. దానిని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఒకవైపు జగన్ పర్యటనలతో ఇబ్బంది పడుతున్నామని పోలీసులు చెబుతుంటే.. కోర్టుకు హాజరు కావాలని అంటే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందులు అని చెబుతున్నారు. అయితే ఆయన 12 ఏళ్ల పాటు బెయిల్ పై ఉన్నారు. తనను కోర్టులు ఏం చేయలేవని ఆలోచనతో ఉన్నట్టు ఉన్నారు. ఇప్పటికీ ఆయన కేసుల్లో ఓ ఆరుగురు న్యాయమూర్తులు మారిపోయారు. పదవీ విరమణ చేశారు. కనీసం కేసు ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. బహుశా ఈ ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి ఈ పిటీషన్ వేసినట్టు ఉన్నారు.