Women Free Bus Scheme: మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ పథకం వల్ల కాంగ్రెస్ కు మహిళా ఓటర్లు బ్రహ్మరథం పడుతారా అనే విషయం ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ప్రధాన హామీని ప్రభుత్వం స్థాపించిన కొన్ని నెలల్లోనే అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం వివిధ పద్ధతులను ఎంచుకుంది. అయితే ఈ పథకం మూలంగా మహిళా లోకం ఉపయోగించుకుంటున్న తీరు మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. 90 శాతం మహిళలు తమ అవసరాల నిమిత్తం చేసే బస్ ప్రయాణంలో ఈ పథకాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ పథకం ప్రారంభంలో కొంతమంది మహిళలు అదేపనిగా ఫ్రీ బాస్ సర్వీసు పేరుతో అవసరం ఉన్నా లేకున్నా ఉపయోగించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఫ్రీ బస్ సర్వీస్ తో తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను, టూరిస్ట్ స్పాట్ లను సందర్శించేందుకు ఉపయోగించుకున్నారు.
దగ్గరి, దూరపు బంధువులకు సంబంధించిన చిన్న, పెద్ద ఫంక్షన్స్ కూడా వెళ్ళి రావడం ప్రస్తుతం కనిపిస్తోంది. దూరంగా ఉన్న కొడుకును, బిడ్డను చూసేందుకు వెళ్ళే తల్లులు, దగ్గరలో కైకిల్ పని లేకుంటే దూరప్రాంతానికి వెళ్ళి పని చేసుకొని, వచ్చిన డబ్బుతో తమ కుటుంబాలను పోషించుకునే తల్లులను కూడా చూశాం. చేతిలో చిల్లిగవ్వలేని సమయంలో బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకోవాలని ఆరాటపడే మహిళలకు ఈ పథకం చాలా వరకు ఉపయోగపడిందని సర్వేలు చెబుతున్నాయి. పనీపాట లేని వాళ్ళు ఊరకే ప్రయాణాలు చేసే మహిళలు కూడా బస్సుల్లో తారసపడ్డం కనిపించింది.
చేతినిండా డబ్బున్నా బస్సులో ఫ్రీ టికెట్ కోసం తన్నుకుంటున్నారు. పైగా తమకు సీట్లు లేవని ఇబ్బంది పడుతూనే ఫ్రీ బస్ సర్వీసు ఎందుకు పెట్టారని కూడా పొడి, పొడి మాటలతో విమర్శించడం చూస్తున్నాం. పొద్దుగల పొయ్యిమీద ఇంత వండి పిల్లగాళ్లను బడికి పంపి బస్ ఎక్కుతున్నారు. ఒకరోజు అమ్మ, నాన్నలను చూసేందుకు, ఒకరోజు అన్నదమ్ములను చూసేందుకు పోతున్నారంటే సరే అనుకోవచ్చు కానీ, చూరుకింద చుట్టం ఇంట్లో ఈ చిన్న ఫంక్షన్ అయినా తప్పనిసరిగా హాజరవుతున్నారని చెబుతున్నారు. అయితే ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువే.
లాభాల బాటలో ఆర్టీసీ
ఫ్రీ బస్ సర్వీస్ మూలంగా ఆర్టీసీ గణనీయమైన వృద్ధి రేటు సాధించిందని, లాభాల బాటలో పయనిస్తోందని ప్రభుత్వ లెక్కలు తేట తెల్లం చేస్తున్నాయి. బస్సు సర్వీసుల సంఖ్య కూడా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా పెరిగింది. ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు మహిళా సంఘాల ద్వారా బస్సు సర్వీసులను నడిపేందుకు అనుసంధానంగా వారికి రుణ సదుపాయం కల్పించే ఉద్దేశ్యంతో మహాలక్ష్మి పథకం కూడా మహిళల్లో ఆర్థిక స్వావలంబన కు తోడ్పడిందని భావిస్తున్నారు.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా.. జాబితా సిద్ధం!
పంద్రాగస్టు నుంచి ఏపీలో..
మహిళా సాధికారతకు ఏదోవిధంగా దోహదం చేసే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కూడా పంద్రాగస్టు నుంచి అమలు చేసేందుకు ఉద్యుక్తులయింది. తెలంగాణ లో మంచి ఫలితాలు రావడం, పథకం తీరుతెన్నులు, మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందడం, ప్రభుత్వానికి మంచిపేరు రావడం లాంటి ఎన్నో విషయాలను స్టడీ చేసిన తరువాతనే ఈ పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కుల, మత బేధరహితంగా ఓట్లు వేసే మహిళలను ఒకేవైపు తిప్పుకొని, ఆ మహిళా ఓటు బ్యాంకు సొంతం చేసుకునేందుకు ప్రభుత్వాలు ఆరాటపడుతున్నట్లు వారి విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మహిళా సాధికారతకు దోహదం చేస్తాయా.?
గతంలో డ్వాక్రా, స్వశక్తి మహిళా సంఘాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని, ఆ సంఘాల పేరున మహిళా సాధికారతకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించి, వాటితో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని, వచ్చిన ఆదాయం ఆ సంఘ సభ్యులు పంచుకోవడం వంటి బృహత్తర పథకాలను రూపొందించి, వాటిని అమలు చేశారు. దానితో మహిళా సంఘాలు ఆ ప్రభుత్వాలకు బాసటగా నిలిచాయి. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఆయా మహిళా సంఘాల ప్రతినిధులు మహిళలను సమీకరించి ఆ సభలను విజయవంతం చేసేందుకు తోడ్పడ్డారు. అదే విధంగా మహిళలను అక్కున చేర్చుకునేందుకు వారి కోసం కొంగొత్త పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, అలాగే సంఘం, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాలు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారుతుందని ఆర్టికవేత్తలు పదేపదే చెబుతూనే ఉన్నారు. వచ్చే ఆదాయాన్ని దువ్వరదుండి చేయకుండా, అవసరాల నిమిత్తం వాడుకొని, మిగతా డబ్బులను ఆదా చేయడంలో మహిళలకు సాటిలేరనేది నిర్వివాదాంశం. ఆ ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను రూపొందిస్తున్నాయి.
Also Read: పులివెందుల, ఒంటి మిట్ట రెండు జెడ్పీ టీసీ స్థానాల కోసం ఎందుకింత రచ్చ..? ఎవరు గెలుస్తారు?
ఈ పథకంపై విమర్శలెందుకు..
అయితే ఈ పథకంపై కొంతమంది విమర్శలు కూడా సంధిస్తున్నారు. ఈ పథకం మూలంగా మహిళలు తమను మర్చిపోతారేమోనన్న భయం కూడా ఆ విమర్శలకు, వ్యతిరేక ట్రోలింగ్ కు కారణం కావచ్చు. గతంలో తమకు రాని ఆలోచన వీరికి ఎలా వచ్చిందనే అక్కసు కూడా కావచ్చని కూడా ప్రభుత్వ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా
పల్లెల్లో కైకిల్ కు పోవుడు బందు పెట్టారు. రోజుకు రూ. వెయ్యి నుంచి రెండు వేలు అడుగుతున్నారు. అవి ఇస్తామని చెప్పినా రావడం లేదని కొంతమంది చెబుతున్నారు. ఒక ఆసామి తమ జొన్న చేను కోసేందుకు కూలీలు దొరకక, అలాగే వదిలేసినట్లు చెప్పుకొచ్చారు.
ఇదీ ఉచితాల జాబితాలో వస్తుందా..?
మహిళలకు ఉచిత బస్సు సర్వీసు ఉచితాల జాబితాలోకి వస్తుందా అనే ఆలోచన కూడా చేస్తూ విమర్శిస్తున్నారు. కొంతమంది సామాజిక స్పృహ ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఫ్రీ బస్సు సర్వీసు ను ఉపయోగించుకోకుండా డబ్బులు కట్టి టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. వారిని ఆదర్శంగా తీసుకొని అవసరమున్న వారు మాత్రమే ఈ పథకాలను ఉపయోగించుకునేలా ముందుకురావాలి.
కానీ ఉచితాలు మరీ ఎక్కువైతే సోమరులు తయారవుతారనే విషయం రాజకీయ నాయకులకు తెలిసినా, తెలవకపోయినా, వారికి సలహాలు ఇచ్చే ఐఏఎస్ లకు తెల్వదా..? ఇలాంటి పథకాల ద్వారా యువత నిర్వీర్యం అవుతుందని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆలోచన చేయకుండా, పోటాపోటీగా ఉచితాల ఆశ చూపించి ఓట్లు దండుకుంటున్నారనీ ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి మారకుంటే భవిష్యత్ తరాలు క్షమించవు. అలా అనుకుంటే సంక్షేమ పథకాలు ఎవరికి అవసరం లేదు. కడు పేదరికంలో ఒంటరి జీవితం అనుభవించే వృద్ధులకు, దివ్యాంగులకు తప్ప వేరే ఎవరికి సంక్షేమం అవసరం లేదు. కానీ ప్రస్తుతం సమాజంలో వేలకు వేలు సంపాదిస్తున్న కుటుంబాలు కూడా సంక్షేమ పథకాల గురించి అర్రులు చాస్తున్నారు. భారీ అంతస్తుల్లో విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్న వారు సైతం రేషన్ బియ్యం సరుకుల కోసం క్యూ లో ముందువరుసలో నిలబడేందుకు సిగ్గుపడ్డం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఆ పథకానికి అర్హులమా కాదా అని, ఎవరికి వారే ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది.