TDP Janasena First List: రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయా? పొత్తులో లభించిన సీట్లు ఆమోదయోగ్యం కాదా? ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదా? అది పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీస్తుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. 50 అసెంబ్లీ స్థానాలు, 10 వరకు పార్లమెంట్ స్థానాలు పొత్తులో భాగంగా జనసేన అడిగినట్లు టాక్ నడిచింది. అప్పుడే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరుగుతుందని.. కాపు ఓటు బ్యాంకు కూటమి వైపు వెళుతుందని రకరకాల విశ్లేషణలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జనసేన సీట్లు విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
పవన్ ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తగా ఉన్నారు. తమ బలాన్ని బట్టి మాత్రమే సీట్లు అడుగుతామని చెప్పుకొచ్చారు. బలానికి మించి సీట్లు అడిగితే అది ప్రత్యర్థికి మేలు చేసినట్టు అవుతుందని కూడా పార్టీ శ్రేణులకు కన్వెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే.. ఇచ్చిన సీట్లలో అత్యధికంగా గెలుచుకోవడమే ఉత్తమమని కూడా సెలవిచ్చారు. కానీ అధినేత మాటలకు పార్టీ శ్రేణులు సంతృప్తి చెందలేదు. ఇంత తక్కువ స్థానాలు కేటాయిస్తారా అంటూ బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని తక్కువ సీట్లతో పవర్ షేరింగ్ సాధ్యమా? అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. జనసేన లోని సీనియర్ నేతలు అయితే తెగ బాధపడుతున్నారు. ఏం చేయాలో వారికి పాలు పోవడం లేదు.
తాజాగా ఓ డిబేట్లో పాల్గొన్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు. ‘ కూటమిలో జనసేనకు 40 కి తక్కువ కాకుండా ఎమ్మెల్యే సీట్లు రావాలి. ఈ సంఖ్యను చేరుకోకపోతే కూటమి ఉద్దేశం, ఓటు బదిలీ సక్రమంగా జరగదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. మెజారిటీ జనసేన మద్దతు దారుల అభిమతం’ ఇది అంటూ ఆయన చెప్పుకు రావడం విశేషం. ఎక్కువ సీట్లు సాధించడం ముఖ్యం కాదని, పొత్తు ద్వారా జగన్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెక్కిలించడమే ప్రధాన ఉద్దేశం అని పవన్ చెబుతుండగా.. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరోలా చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు సీట్ల కేటాయింపు సంఖ్య పెరగాలని జనసైనికులు కోరుతున్నారు. వీలైనంతవరకూ సీట్లు పెంచేందుకు పవన్ ప్రయత్నించాలని కోరుతున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.