Chandrababu: తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. టికెట్లకు నో చెప్పారు. వైసిపి నాయకత్వంతో విభేదించి..ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి టిడిపి వైపు వచ్చిన సంగతి తెలిసిందే. వీరంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలను చంద్రబాబు అడియాశలు చేశారు. కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మాత్రమే తొలి జాబితాలో చోటు దక్కింది. ఇందులో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిల నియోజకవర్గాల్లో వేరే వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డిని మాత్రం గాల్లో ఉంచారు.దీంతో వారు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియాలో ఈ నేతలపై రకరకాలప్రచారం జరుగుతోంది.
గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఆరోపణతో ఈ నలుగురు వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అప్పటినుంచి టిడిపి ఎమ్మెల్యేలు గానే కొనసాగుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఈ నలుగురికి టికెట్లు ఖాయమని ప్రచారం జరిగింది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు. తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవికి టికెట్ కేటాయించలేదు. ఆమె స్థానంలో శ్రవణ్ కుమార్ కు అభ్యర్థిగా ప్రకటించారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాకుండా కాకర్ల సురేష్ కు ఎంపిక చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి పేరు తొలి జాబితాలో లేదు. ఆయన రెండు మూడు నియోజకవర్గాలపై దృష్టి పెట్టడంతో.. ఏదో ఒక నియోజకవర్గం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు మాత్రం టికెట్ లేనట్టేనని టాక్ నడుస్తోంది. వైసీపీ నాయకత్వాన్ని విభేదించి టిడిపిలో చేరితే ఏంటి పరిస్థితి అని వారు నిట్టూరుస్తున్నట్లు తెలుస్తోంది.
జనసేన, బిజెపికి సీట్లు సర్దుబాటు చేయాల్సి రావడంతో ఎక్కడికక్కడే సీనియర్లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొందరు సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారు. జూనియర్ల పేర్లతో జాబితాను ప్రకటించడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. అయితే మలి జాబితాలో ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారానికి దిగింది. చేసిన పాపానికి ఫలితం అనుభవించండి అంటూ కామెంట్స్ పెడుతూ వైసిపి శ్రేణులు పోస్టులను వైరల్ చేస్తున్నాయి. జగన్ మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. మీరు చేసింది ఏమిటి అని నిలదీసినంత పని చేస్తున్నారు.ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవి టికెట్ పై నమ్మకం పెట్టుకున్నారు.అమరావతికి మద్దతుగా ఆ మధ్యన జరిగిన సభలో ఏకంగా చంద్రబాబును, లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు. నిత్యం చంద్రబాబు స్మరణ చేశారు. అయినా సరే ఆమెకు టికెట్ లభించలేదు. అయితే టికెట్ దక్కలేదనే బాధ కంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎక్కువగా వారు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.