NTR : దేశంలో మహిళలు తలెత్తకునేలా చేసిన రాష్ట్రం ఏపీ. మహిళాభ్యున్నతికి దిక్సూచిగా నిలిచింది కూడా ఏపీయే. అందులో కీలకమైనది మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు. దేశంలో ఇటువంటి సరికొత్త ఆలోచన చేసింది కూడా మన రాష్ట్రమే. అప్పటివరకూ భూ ధ్రువపత్రాల్లో ఎక్కడా మహిళల పేరు కనిపించేది కాదు. దీనిని మార్పుచేశారు నందమూరి తారక రామారావు. దేశంలో సరికొత్త రాజకీయాలకు నాంది పలికింది ఎన్టీఆరే. ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయమే మహిళలకు ఆస్తి హక్కు. ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఆ నిర్ణయం దేశ వ్యాపితమైంది.
కాంగ్రెస్ పాతకాలం నాటి విధానాలపై ఎన్టీఆర్ ఫోకస్ పెట్టారు. సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టారు. రూ.2లకే కిలో బియ్యం పథకం, గృహనిర్మాణం వంటి వాటికి ఎన్టీఆర్ భీజం వేశారు. దానిని కొనసాగించారు. వినూత్న కార్యక్రమాలతో పేదలకు సంక్షేమ ఫలాలు అందించడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా సామాజిక రుగ్మతలపై కూడా దృష్టిసారించారు. అందులో భాగమే మహిళలకు ఆస్తిహక్కు. సీఎం అయిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం లోనే మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అంతకుముందు మహిళలకు ఆస్తి హక్కు ఉండేది కాదు. తల్లిదండ్రులు ప్రత్యేకంగా కుమార్తెలకు రాసిస్తే తప్ప వాటా వచ్చేది కాదు. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి కుమారులకు మాత్రమే దక్కేది. దానిని ఎన్టీఆర్ మార్చి కుమార్తెలకు కూడా సమాన హక్కు కల్పించారు.
ఈ నిర్ణయంతో దేశం యావత్ ఏపీ వైపు చూడడం ప్రారంభించింది. మహోన్నత నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించడం ప్రారంభమైంది. సామాజిక రుగ్మతపై ఎన్టీఆర్ కొట్టిన దెబ్బతో అటు మహిళాలోకం సైతం మురిసిపోయింది. అప్పటివరకూ సినీచరిష్మతో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఈ ఒక్క నిర్ణయంతో పాలనలోనూ తనకు పట్టుందని నిరూపించుకున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన చట్టం కదా అని కాంగ్రెస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అక్కడకు పదేళ్ల తరువాత అదే కేంద్ర ప్రభుత్వం మహిళకు ఆస్తి హక్కు చట్టం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
ఒక్క మహిళలకు ఆస్తి చట్టమే కాదు. చాలా పథకాలు, నిర్ణయాల్లో ఎన్టీఆర్ మహిళల పక్షపాతిగా నిలిచారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విశ్వ విద్యాలయాన్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. తిరుపతిలో పద్మావతి పేరుతో వర్సిటీ నెలకొల్పారు. అప్పట్లో ఇదొక సహసోపేత నిర్ణయం. ఇక అన్ని విద్యా సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. దీంతో విద్యా సంస్థల్లో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీలో మహిళల అక్షరాస్యత పెరిగింది ఎన్టీఆర్ హయాంలోనే. ఎన్నెన్నో వినూత్న కార్యక్రమాలతో మహిళలు అగ్రగామిగా నిలవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించారు. అమలుచేసి చూపించారు. దటీజ్ ఎన్టీఆర్.