Astrologer Venu Swamy: ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. గెలుపు పై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వైసిపి చెప్తోంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో కూటమికి భారీ విజయం వరిస్తుందని ఆ మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలకు ఉన్న ధీమా.. వైసీపీలో కనిపించడం లేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. పోలింగ్ శాతం పెరగడం, ఉద్యోగ ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏకపక్షంగా పడడం, పోలింగ్ కు ముందు పెద్ద ఎత్తున అధికారులబదిలీ కావడంతో ఒక రకమైన అనుమానాలు అధికార పార్టీలో పెరిగాయి. కూటమికి సానుకూల పవనాలు వీచినట్లు విశ్లేషణలు రావడంతో.. అధికార పార్టీ డీలా పడింది. ఈ సమయంలో క్యాడర్లో నమ్మకం పోతోంది. దీనిని నియంత్రించేందుకు జగన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఐప్యాక్ టీం తో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగంతో సమావేశం కానున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని వైసీపీ శ్రేణులు నమ్ముకున్నాయి.గతంలో ఆయన చేసిన జోష్యాలను గుర్తు చేసుకుంటున్నాయి. వైసిపి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని వేణు స్వామి గతంలో చెప్పారు. జగన్ జాతకరీత్యా హ్యాట్రిక్ కొడతారని కూడా చెప్పుకొచ్చారు.వైసిపి ఎన్ని స్థానాల్లో గెలవబోతుందనేది కూడా ప్రకటించారు. మొత్తం 136 స్థానాల్లో వైసిపి విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు. 2029 ఎన్నికల్లో సైతం జగన్ గెలిచి హ్యాట్రిక్ కొడతారని వేణు స్వామి స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు. దీంతో వేణు స్వామిని గుర్తుచేసుకొని ఉపశమనం పొందుతున్నారు వైసీపీ శ్రేణులు.
అయితే అదే వేణు స్వామి కొద్ది రోజుల కిందట టిడిపి చేతిలో పవన్ కళ్యాణ్ మోసపోతారని జోష్యం చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ కనుమరుగైతే.. ఆ పార్టీ చేతిలో ఎలా మోసపోతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక ఆరు నెలల కింద తెలంగాణ ఎన్నికల్లో సైతం వేణు స్వామి జోష్యం చెప్పారు. కెసిఆర్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని.. కొద్దిరోజుల తర్వాత కేటీఆర్ కు పట్టాభిషేకం చేసి.. కెసిఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని జోష్యం చెప్పారు. కానీ అక్కడ పరిస్థితి విరుద్ధంగా మారింది. కెసిఆర్ ఓడిపోయారు. ఆ పార్టీ కకావికలం అయింది. కుమార్తె కవిత అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సైతం కేసిఆర్ ఇబ్బంది పడినట్లు వార్తలు వచ్చాయి. కెసిఆర్ విషయంలో వేణు స్వామి జోష్యం కనీస స్థాయిలో కూడా ఫలించలేదు. కానీ ఇంతటి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని వేణు స్వామి చెప్పడం అతి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణలో జరిగిన పరిణామాలతో ఏపీలో సైతం వేణు స్వామి జోష్యం పై ఒక రకమైన అనుమానాలు ఉన్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Will venu swamys prediction come true in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com