Amaravati bank offices: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కీలక నిర్మాణాలను శరవేగంగా జరిపించాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం నిర్మాణాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే అమరావతి వేదికగా మరో కీలక ఘట్టం. ఒకేసారి 12 బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అమరావతిలో శంకుస్థాపన చేయనున్నాయి. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సమక్షంలోనే శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే జరిగితే అమరావతి రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రాంతీయ కార్యాలయాలుగా..
రాష్ట్ర విభజన తరువాత ప్రధాన బ్యాంకులకు సంబంధించి కార్యాలయాలు విజయవాడలో( Vijayawada) కొనసాగుతున్నాయి. అయితే అవి ప్రాంతీయ కార్యాలయాలుగా మాత్రమే ఉన్నాయి. ప్రధాన కార్యాలయాలని దాదాపు హైదరాబాదు నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అందుకే అమరావతిలో దాదాపు పది బ్యాంకులకు సంబంధించి ప్రధాన కార్యాలయాలు నిర్మితం కానున్నాయి. ప్రధానంగా ఉత్పండరాయుని పాలెం సమీపంలోని ఎన్ 10 రోడ్డు వద్ద ప్రభుత్వం బ్యాంకు ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. వాటిలోనే ఇప్పుడు నిర్మాణాలను ప్రారంభించారు. వీలైనంత త్వరగా ఈ భవన నిర్మాణ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే ఆర్థిక కార్యకలాపాలకు వేదికగా మారనుంది అమరావతి.
ఎస్బిఐ కు మూడెకరాలు..
అమరావతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు( State Bank of India) మూడు ఎకరాలు, ఆప్కాబ్ కు రెండు ఎకరాలు, కెనరా బ్యాంక్, యూబిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులకు 25 సెంట్లు చొప్పున స్థలాలు కేటాయించారు. ఈ ప్రధాన కార్యాలయాలను 14 అంతస్తుల భవనాలు, లక్ష చదరపు గజాల విస్తీర్ణం కలిగి నిర్మించనున్నారు. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రధాన కార్యాలయాల నుంచి ఆర్థిక కార్యక్రమాలు మొదలుకానున్నాయి. మొత్తానికైతే అమరావతిలో మరో భారీ ఈవెంట్ జరగనుందన్నమాట.