YCP: ఏపీలో ( Andhra Pradesh) రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచి పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. సామాజిక వర్గాలను తెరపైకి తెచ్చి మరోసారి విజయం అందుకోవాలని భావిస్తోంది. కానీ అది అంత సులువుగా దక్కేలా లేదు. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు వైసిపి చేపట్టిన ఈ ఫార్ములా ఆ పార్టీకి వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు ఎంత మాత్రం అది సాధ్యమయ్యే అవకాశం లేదు. కుల సమీకరణల ద్వారా రాజకీయం చేస్తామంటే కుదిరే పని కూడా కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని కాపు సామాజిక వర్గంపై జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతం మాదిరిగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనే నినాదం పక్కకు వెళ్లిపోయినట్లు సమాచారం.
* అలా దూరమైన వర్గాలు..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ సామాజిక వర్గాలే ఉండేవి. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి కారణం ఆ రెండు సామాజిక వర్గాలు మాత్రమే. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. ఎస్సీలతో పాటు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో గెలవగలిగింది వైయస్సార్ కాంగ్రెస్. అయితే 2019 ఎన్నికల్లో ఆ రెండు సామాజిక వర్గాలు స్టాండ్ అయ్యాయి. ఆపై మిగతా సామాజిక వర్గాలు సహకరించాయి. దీంతో అంతులేని, అద్భుత విజయం సొంతం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి బీసీ నామస్మరణ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎలాగూ సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుందని భావించి అలా చేశారు. కానీ రాజకీయంతో పాటు ఆర్థికంగా ఏమాత్రం సహకారం అందకపోవడంతో రెడ్డి సామాజిక వర్గం మౌనం దాల్చింది. ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు చీలిపోయి దారుణ పరాజయం ఎదురైంది.
* పోరాటాలు లేకుండా కష్టం..
ఇప్పుడు కూడా కుల సమీకరణల ద్వారా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజిక వర్గం ఉందన్న ఆలోచనతో ముద్రగడ పద్మనాభం, చేగొండి హరి రామ జోగయ్య, వంగవీటి మోహన్ రంగా వంటి కుటుంబాలను ఆకర్షించాలని చూస్తున్నారు. ఇప్పటికే ముద్రగడ ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. చేగొండి హరి రామ జోగయ్య వైసీపీకి అనుకూలంగా పావులు కదుపుతున్నారు. వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశ కిరణ్ ను వైసీపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పేరు మోసిన కుటుంబాలు వైసీపీలోకి వస్తే చాలదు. క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గంలో ఆశలు చిగురించే ప్రయత్నాలు జరగాలి. వారి సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి స్పందించాలి. అంతేతప్ప ప్రముఖుల కుటుంబాలను కాపుల్లో చేర్చితే ఎంత మాత్రం వర్కౌట్ కాదు. 2014లో టిడిపి గెలిచిన తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమం లేవనెత్తారు. ఆ సమయంలో కాపులు టిడిపి పట్ల ఆగ్రహంతో ఉండేవారు. అలా వారు వైసిపి వైపు వెళ్లారు. కానీ ఆ పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆ పార్టీని నమ్మలేదు కాపులు. ఇప్పుడు కూడా కాపు ప్రముఖులను నమ్ముకుంటే కంటే.. కాపుల కోసం చేసే ప్రయత్నాలతో పాటు ప్రకటనలు, పోరాటాల వారికి ఆకట్టుకునేలా చేస్తాయి. ఇక తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.