Former minister arrested soon: ఏపీలో( Andhra Pradesh) మరో మాజీ మంత్రి అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతోందా? దీనికి సంబంధించి ఆధారాలు సేకరించారా? అరెస్టు తరువాయి అని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చాలామంది నేతలు దూకుడుగా ఉండేవారు. అటువంటి వారిలో మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఒకరు. 2019లో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి గెలిచారు అప్పలరాజు. సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు, మాజీ మంత్రి శివాజీ కుమార్తె గౌతు శిరీష పై గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈ యువ డాక్టర్ను గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా తన మంత్రివర్గంలో తీసుకున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు ఆయన మంత్రి గానే కొనసాగారు. ఈ క్రమంలో దూకుడుగా ఉండేవారు. అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకడుగు వేసే వారు కాదు. అప్పట్లో చంద్రబాబుపై అసెంబ్లీ వేదికగా కూడా రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అరుదైన వ్యాధితో చంద్రబాబు బాధపడుతున్నారంటూ హేళన చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు పలాస వచ్చినప్పుడు కూడా అప్పలరాజు పై నిప్పులు చెరిగారు. చిన్నపాటి చేపగా అభివర్ణించారు. కూటమి వచ్చిన వెంటనే అప్పలరాజు అరెస్టు తప్పదని ప్రచారం నడిచింది. కానీ ఇప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.
సోషల్ మీడియా కామెంట్స్ పై ఫిర్యాదులు..
వైసీపీ హయాంలో సోషల్ మీడియా( social media) వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు అప్పలరాజు. దానిపై అప్పట్లోనే ఫిర్యాదులు ఉన్నాయి. గత కొద్దిరోజులుగా అప్పలరాజు పై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన అరెస్టు విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. పైగా వైసీపీ హయాంలో టిడిపి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారిని టార్గెట్ చేశారు అప్పలరాజు. ఆ పై మహిళా నేత అని చూడకుండా గౌతు శిరీషపై అసభ్యకరంగా పోస్టింగులు పెట్టించారన్న ఆరోపణలు అప్పలరాజు పై ఉన్నాయి. కొద్ది రోజుల కిందట కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట, ఇటీవల ఓ వ్యాపారి కిడ్నాప్ తో ప్రభుత్వం పై విమర్శలు చేశారని వైసీపీ నేత ఒకరిపై కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో అప్పలరాజును స్టేషన్కు తీసుకెళ్లి ఏడు గంటలపాటు పోలీసులు విచారించారు. అవసరం అనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని కూడా చెప్పారు. దీంతో మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టు తప్పదు అన్న ప్రచారం నడుస్తోంది.
తెరపైకి పాత కేసులు..
అప్పలరాజు( appala Raju ) పశుసంవర్ధక శాఖ మంత్రిగా కూడా ఉండేవారు. డైరీ కి సంబంధించి, పాల అభివృద్ధికి సంబంధించి చాలా రకాల పథకాలను అప్పట్లో ప్రవేశపెట్టారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందులో భారీ అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటి విషయంలో అప్పలరాజు అరెస్టు ఉంటుందని ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉన్న ఫిర్యాదులపై స్పందించారు పోలీసులు. అదే సమయంలో గతంలో అప్పలరాజు నిర్వహించిన పశుసంవర్ధక శాఖ వైఫల్యాలను సైతం తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మొన్న ఏడు గంటల పాటు అప్పలరాజును విచారించేసరికి అరెస్టు తప్పదని ప్రచారం నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళన చెందాయి. అప్పలరాజును విచారించి విడిచిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నాయి. అయితే త్వరలో అప్పలరాజు అరెస్టు ఉంటుందని మాత్రం తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.