Amaravati farmers: అమరావతి ( Amaravati capital ) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన పై ఒక క్లారిటీ వస్తోంది. ఆ పార్టీకి అమరావతి రాజధాని అనేది శాపంగా మారింది. అమరావతిని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చే క్రమంలో.. ఒక్క అమరావతి ప్రజలే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు వ్యతిరేకించారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంత మాత్రం మార్పు కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా అమరావతి విషయంలో మళ్లీ కలుగజేసుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే అమరావతి రైతులు ఇప్పుడు భయపడుతున్నారు. రెండో విడత భూ సమీకరణకు రకరకాల షరతులు పెడుతున్నారు. అయితే దీని వెనుక ఉన్న కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య వారికి చుక్కలు చూపించింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఇప్పుడు అమరావతి రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నారు.
రైతుల షరతులు..
ఇంకా కూటమి ( Alliance ) ప్రభుత్వానికి మూడేళ్ల వ్యవధి ఉంది. ఇప్పుడు తీసుకున్న భూములకు బదులు రిటర్నబుల్ ఫ్లాట్స్ అభివృద్ధి చేయాలన్నది ఈ షరతు. అలా చేయకపోతే మూడు సంవత్సరాల్లో ఐదు లక్షల రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతాయి. పొరపాటున మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి వారికి తెలుసు. అందుకే కూటమి ప్రభుత్వం ఎదుట ఈ కీలక ప్రతిపాదన పెడుతున్నారు. ఒకటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరించినట్లు అవుతుంది. ముందే జాగ్రత్త పడినట్లు అవుతుంది.
అసంతృప్తిగా భావిస్తున్న వైసిపి..
అమరావతి రైతుల్లో భయానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కారణం. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ కొత్త పల్లవి అందుకుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు ఎంతలా ఇబ్బంది పెట్టాలో అంతలా పెట్టారు. ఇప్పుడు రైతుల భయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్వాన్స్ గా తీసుకుంటుంది. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రస్తావన తెచ్చేందుకు భయపడేది. కానీ అదనపు భూ సమీకరణకు ప్రభుత్వం దిగడంతో రైతుల నుంచి ఒక రకమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే దానిని అసంతృప్తిగా భావిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అది అసంతృప్తి కాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై భయం అన్న విషయం మరిచిపోతోంది. అమరావతి ప్రాంత రైతులు ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డిని చూడరు. అవసరం అనుకుంటే ఏ చిన్న పార్టీ కైనా అక్కడ అవకాశం ఇస్తారే కానీ.. అమరావతి రైతులపై ఎంత ప్రేమ వలకబోసినా వారు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వరు. ఇది ముమ్మాటికి వాస్తవం.