Visakhapatnam: ఏపీలో కూటమికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.ఒకవైపు పాలనతో పాటు మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో.. లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఇసుక విధానం పై ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు రేగుతున్నాయి. మరోవైపు కీలక సంక్షేమ పథకాల మాటేమిటి అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మెడకు చుట్టుకుంటోంది. కేంద్రం ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉంటే.. చంద్రబాబు సర్కార్ సైతం ఓకే చెప్పిందన్న వార్తలు వస్తున్నాయి. డెక్కన్ క్రానికల్ పత్రిక ఇదే కథనం ప్రచురించడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కార్యాలయం పై దాడికి ప్రయత్నించాయి. కార్యాలయం బోర్డు తగులబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు మొండిగా ముందుకెళ్తే మాత్రం నష్టపోయేది తెలుగుదేశం, జనసేన. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణకు కేంద్రం పావులు కదపగా.. అప్పట్లో విపక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు వైసీపీ సర్కార్ పై బురద జల్లాయి. ఇప్పుడు అదే బురద ఆ రెండు పార్టీలపై పడుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పోటా పోటీగా హామీలు ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా మోడీని కలిసి ప్రైవేటీకరణ ఆపేందుకు ప్రయత్నిస్తానని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు అదే ప్రతిబంధకంగా మారనుంది. ఎన్నికల ప్రచార సభలతో పాటు ప్రమాణ స్వీకారం నాడు మోదీతో ఎంతో అనుబంధంగా కనిపించారు పవన్. పవన్ అంటే తుఫాన్ అంటూ మోడీ ప్రత్యేకంగా అభిమానించిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కోరిక మేరకు సోదరుడు చిరంజీవితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు మోడీ. అంతటి అనుబంధం ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు కదా అని పవన్ ను ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో విపక్షంలో ఉన్న పవన్ మోడీకి వివరిస్తానని చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావించి మోదీ దృష్టికి తీసుకెళ్ళరా? అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అయితే చంద్రబాబు సైతం ప్రైవేటీకరణ అంశానికి మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సాయం అత్యంత కీలకం. అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర సాయం అత్యంత ఆవశ్యం. అందుకే చంద్రబాబు సైతం ఓకే చెప్పారని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక కథనం ప్రచురించింది. టిడిపి మద్దతుతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగంగా సాగే అవకాశం ఉందని ఆ కథనం తేల్చింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారని ప్రచారం జరుగుతోంది. ప్రైవేటీకరణతో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు వస్తాయని చెప్పారని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తన కథనంలో గుర్తుచేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖ స్టీల్ కాపాడుకోవడం కంటే ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటితో పాటు అమరావతి, పోలవరం వంటి నిర్మాణాలు కీలకమని చంద్రబాబు ఒక స్థిరమైన ఆలోచనకు వచ్చినట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎలా చూసుకున్నా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కావడం ఖాయంగా తేలుతోంది. అదే జరిగితే రాజకీయంగా టిడిపి తో పాటు జనసేన మూల్యం చెల్లించుకోవడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన టిడిపి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. దీంట్లో తమ తప్పు లేదన్న రీతిలో వ్యవహరిస్తోంది. అందుకే లోకేష్ ప్రత్యేక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. అయినా సరే టిడిపి కూటమిని విపక్షాలు కార్నర్ చేసే అవకాశం ఉంది.