Mudragada Padmanabham Letter: ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham) నిత్యం లేఖలు రాస్తుంటారు. గోదావరి యాసలో ఈ లేఖలు సాగుతుంటాయి. అయితే ఆయన ఉద్యమం చేసినా, లేఖలు రాసినా దానికి ఒక లెక్క ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య కాపు రిజర్వేషన్ ఉద్యమం చేశారు. తద్వారా అప్పటి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చారు. 2019 నుంచి 2024 మధ్య అదే కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఆపేశారు. దానికి ఆయన చెప్పిన కారణం తన సాటి కాపు సోదరులు తనను అనుమానంగా చూడడమే. అయితే అదే ముద్రగడ ఇప్పుడు మళ్లీ తన పాత పాత్ర పోషించడం ప్రారంభించారు. ఇప్పుడు కాపులకు అన్యాయం జరుగుతోంది అంటూ చంద్రబాబుకు తాజాగా లేఖ రాశారు. మాజీమంత్రి అంబటి రాంబాబు పై కేసులు, అరెస్టు చేయడానికి తప్పు పట్టారు ముద్రగడ. ఎమర్జెన్సీ ని గుర్తు చేయడమే కాదు.. ఏపీలో పాలన ఉందా? అంటూ ప్రశ్నించే దాకా వచ్చారు. అయితే ఈసారి కాపు ఉద్యమాన్ని గుర్తు చేయలేదు కానీ.. కాపు సామాజిక వర్గాన్ని మాత్రం మళ్లీ ముందు పెట్టారు. ఈ లేఖలో చంద్రబాబును ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ పై ప్రేమతో.. అంటూ చంద్రబాబుతో పాటు లోకేష్ ను ప్రస్తావిస్తూ ఈ లేఖ ఉంది.
దీనిపైనే చర్చ..
ప్రస్తుతం ముద్రగడ వ్యవహార శైలి పై బలమైన చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో( social media) సైతం ఎక్కువ రచ్చ కొనసాగుతోంది. ముద్రగడ పద్మనాభం కు ఇప్పుడే కాపులు గుర్తుకొచ్చారా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇదే ముద్రగడ పవన్ కళ్యాణ్ ను దారుణంగా ఓడిస్తానని శపథం చేశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపించిన ఆయన పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని సవాల్ చేశారు. అంతటి వ్యక్తి ఈ తరహా సవాల్ చేయవచ్చా? అయితే ఎప్పుడైతే కూటమి గెలిచిందో తనకు తాను ప్రభుత్వానికి విన్నవించారు. పేరు మార్చుకున్నారు.
సోషల్ మీడియాలో సెటైర్లు..
కాపులకు అన్యాయం జరుగుతోందని కొత్తగా ఆందోళన చెందుతున్నారు ముద్రగడ పద్మనాభం. మరి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) హయాంలో ఇదే ముద్రగడ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసినప్పుడు ఇదే ముద్రగడ ఎక్కడికి వెళ్లిపోయారు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై అమ్మనా బూతులు తిట్టినప్పుడు, చిరంజీవి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే ముద్రగడ ఎక్కడికి వెళ్లిపోయారని నిలదీస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని అంబటి రాంబాబు కోసం ప్రశ్నిస్తున్నారు అంటూ ఎక్కువమంది ఆయన తీరును తప్పుపడుతున్నారు. ఐదేళ్ల వైసిపి హయాంలో జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాసింది తక్కువ. కానీ 20 నెలల కూటమిపాలనలో మాత్రం ఏ అంశం తెరపైకి వచ్చినా.. ముద్రగడ ప్రభుత్వానికి లేఖలు రాయడం పరిపాటిగా మారింది. అయితే ముద్రగడ లేఖలను పట్టించుకునే స్థితిలో మాత్రం కూటమి ప్రభుత్వం లేదు. అయితే ఇప్పుడు కాపులను రెచ్చగొట్టడం ద్వారా వైసిపి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందన్న ఆలోచన కాపుల్లో ఉంది. ఇటువంటి సమయంలో ముద్రగడ ఎన్ని రకాల లేఖలు రాసినా.. వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.