Homeఆంధ్రప్రదేశ్‌KCR And Jagan: కేసీఆర్, జగన్ లను అరెస్ట్ చేస్తారా? సాధ్యమేనా?

KCR And Jagan: కేసీఆర్, జగన్ లను అరెస్ట్ చేస్తారా? సాధ్యమేనా?

KCR And Jagan: రాజకీయాలు అనేది కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు, ఒక సంక్లిష్ట గణిత శాస్త్రం. ఇందులో ప్రతీ నిర్ణయం, ప్రతి చర్య వెనుక లెక్కలు, వ్యూహాలు, సెంటిమెంట్లు దాగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ను అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయి.

Also Read: లోకేష్ కనకరాజు vs నెల్సన్… ఆ డైరెక్టర్ మీద ఎందుకింత వ్యతిరేకత..?

అరెస్ట్‌ సెంటిమెంట్‌.. గెలుపుకు మెట్టు
భారత రాజకీయాల్లో సెంటిమెంట్‌ ఒక శక్తివంతమైన ఆయుధం. ఒక నాయకుడిని అరెస్టు చేసి జైలుకు పంపితే, అది ఆ నాయకుడికి ప్రజల్లో సానుభూతి తెచ్చిపెడుతుంది. ఈ సానుభూతి తరచూ ఎన్నికల్లో ఓట్లుగా మారుతుంది. కేసీఆర్‌ ప్రభుత్వం రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు, ఆయనకు సానుభూతి పెరిగి, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలపడింది. ఫలితంగా రేవంత్‌ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు. 2023లో జగన్‌ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసింది. ఈ చర్య తెలుగుదేశం పార్టీకి భారీ సానుభూతిని తెచ్చిపెట్టి, 2024 ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో అధికారంలోకి రావడానికి కారణమైంది. దీనికి విరుద్ధంగా, వైఎస్సార్‌సీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఇక జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేయడం ఆయన పార్టీకి ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టింది. హేమంత్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అరెస్టు చేయడం అనేది రాజకీయంగా వ్యతిరేక ఫలితాలను తెచ్చిపెట్టవచ్చు. అందుకే చంద్రబాబు జగన్‌ను, రేవంత్‌ కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి జంకుతారు.

వైఎస్సార్‌సీపీకి బలం తెచ్చిన చరిత్ర..
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం జగన్‌ను 16 నెలలపాటు జైలులో ఉంచింది. ఈ అరెస్టు వైఎస్సార్‌సీపీని ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. జగన్‌ జైలు జీవితం ప్రజల్లో సానుభూతిని రేకెత్తించి, వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక శక్తివంతమైన పార్టీగా స్థిరపడడానికి దోహదపడింది. ఈ చరిత్ర నేపథ్యంలో, జగన్‌ను మళ్లీ అరెస్టు చేయడం వైఎస్సార్‌సీపీకి మరింత బలాన్ని ఇవ్వవచ్చని చంద్రబాబు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రజా కోర్టులో ఇమేజ్‌ దెబ్బతీయడం..

ప్రస్తుత రాజకీయ నాయకులు అరెస్టులు, జైలు శిక్షల వంటి సంప్రదాయ వ్యూహాల నుంచి కొత్త వ్యూహాల వైపు మళ్లుతున్నారు. ఈ కొత్త వ్యూహం ప్రజల మనసుల్లో ప్రత్యర్థి నాయకుల ఇమేజ్‌ను దెబ్బతీయడంపై దృష్టి పెడుతోంది. ప్రత్యర్థులపై లక్షల కోట్ల అవినీతి, రాష్ట్ర ఖజానా దోపిడీ, ప్రజాధనం దుర్వినియోగం వంటి ఆరోపణలు చేస్తూ, వారి ఇమేజ్‌ను ప్రజల ముందు దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. అరెస్టు చేసి సానుభూతి తెచ్చే ప్రమాదాన్ని నివారించడానికి, ప్రజల మధ్య ప్రత్యర్థులను ‘దోషులు‘గా చిత్రీకరించడం ద్వారా వారి రాజకీయ భవిష్యత్తును బలహీనపరచడం ఈ వ్యూహం లక్ష్యం. ఈ విధానం ద్వారా, ప్రత్యర్థి నాయకులు అధికారంలోకి వస్తే అవినీతి, అరాచక పాలన తీసుకొస్తారనే అభిప్రాయాన్ని ప్రజల్లో రూపొందించడం సులభమవుతుంది. దీనివల్ల ఆ నాయకుల ఇమేజ్, వారి పార్టీ రాజకీయ బలం రెండూ దెబ్బతింటాయి.

తప్పుతున్న గెలుపు లెక్కలు..
రాజకీయ గణితంలో ఒకటి మరొకటితో కలిస్తే, ఫలితం ఎప్పుడూ రెండు కాదు. అది 22 కావచ్చు లేదా శూన్యం కావచ్చు. అందుకే రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాలనూ లెక్కలోకి తీసుకుంటారు. జగన్, కేసీఆర్‌లను అరెస్టు చేయడం వల్ల వారి రాజకీయ బలం పెరిగే ప్రమాదం ఉందని చంద్రబాబు, రేవంత్‌లు గ్రహించారు. అందుకే, అరెస్టులకు బదులు, ప్రజల మనసుల్లో వారి ఇమేజ్‌ను దెబ్బతీసే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version