Jayadev Galla: టిడిపిలోకి గల్లా జయదేవ్( Galla Jaidev) రీఎంట్రీ ఇస్తారా? మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా? రాజ్యసభ పదవి కేటాయిస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. టిడిపి నుంచి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు గల్లా జయదేవ్. ఈ ఎన్నికలకు ముందు మాత్రం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వెళుతూ వెళుతూ మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పుకున్నారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులతోనే గల్లా జయదేవ్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఆయన తప్పుకోవడంతో మరో పారిశ్రామికవేత్త రంగంలోకి దిగారు. పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. గల్లా జయదేవ్ మూడోసారి పోటీ చేసి గెలిచి ఉంటే ఆయనకు తప్పకుండా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కేది. కానీ రకరకాల పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు.
Also Read: ఆ ఒక్క ట్వీట్ ఆ నేత కొంప ముంచనుందా?
* పరిస్థితిని అంచనా వేయలేక
అయితే పరిస్థితిని అంచనా వేయలేక గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వస్తుందని నమ్మకం లేక ఆయన రాజకీయాల నుంచి వెళ్లిపోయారని ఒక టాక్ అయితే ఉంది. అయితే గల్లా జయదేవ్ లాంటి నేత రాజకీయాలకు దూరం కావడం.. అందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణమని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అలా చేశారన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే రాజకీయాలకు దూరమైన గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీని మాత్రం వీడలేదని.. ఈ ఎన్నికల్లో బలంగానే పనిచేశారన్న అనుమానాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జయదేవ్ సైతం చాలా యాక్టివ్ అయ్యారు. నిత్యం చంద్రబాబు వెంట కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న దావోస్ పర్యటనలో సైతం కనిపించారు. తాజాగా ప్రాజెక్టును గల్లా జయదేవ్ నేతృత్వంలోని అమర్ రాజా కంపెనీ దక్కించుకుంది.
* తొలుత ఆ పదవి అని
అయితే గల్లా జయదేవ్ ను ఢిల్లీలో( Delhi) ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని అంత ప్రచారం నడిచింది. అది క్యాబినెట్ హోదా పదవి. కానీ ఆ పదవిని అనూహ్యంగా ఓ మాజీ ఐఏఎస్ అధికారికి ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా రాజ్యసభకు వినిపిస్తుంది. తప్పకుండా జయదేవ్ ను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడం, పార్టీతో పాటు అధినేత పట్ల విధేయతతో ఉండడం, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు కావడంతో ఆయన సేవలను తెలుగుదేశం పార్టీ వినియోగించుకుంటుందన్న ప్రచారం ఉంది.
* రాజ్యసభ పదవీ ఖాయం
మరోవైపు టిడిపి కూటమికి ( TDP Alliance )భారీగా రాజ్యసభ స్థానాలు దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఒక సీటు ఖాళీ అయింది. ఏపీ నుంచి మరికొందరు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేసే పరిస్థితి ఉంది. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సైతం పదవులకు రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది. అలా ఖాళీ అయిన స్థానాలను టిడిపి నేతలతో నింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జయదేవ్ తప్పకుండా రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అవుతారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
Also Read: జనసేనలోకి ఒకప్పటి టిడిపి నేత.. ఆ మాజీ మంత్రి మంత్రాంగం!