Jagan: జగన్ వ్యతిరేక శక్తులను చంద్రబాబు ఏకతాటిపైకి తీసుకురాగలిగారా? ఆయనను అష్టదిగ్బంధం చేశారా? అచేతనం చేశారా? అందులో నుంచి జగన్ బయటపడలేరా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే బలమైన చర్చ నడుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు పట్టు బిగించారు. జగన్ వ్యతిరేకులను ఏకతాటి పైకి తేవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
గత ఎన్నికల్లో జగన్ విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సానుభూతి విపరీతంగా పనిచేసింది. 2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో జగన్ అధికారాన్ని కోల్పోవడం ఒకటైతే.. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకోవడం కూడా ఒక కారణం. అప్పటికే కేసుల రూపంలో జగన్ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు రాజకీయంగా దెబ్బతీశారు. ఈ పరిణామాల వల్ల జగన్ ప్రజల్లో సానుభూతి పొందగలిగారు. పైగా ఒకే ఒక్క అవకాశం అంటూ అడిగిన తీరుతో ప్రజలు మెత్తబడ్డారు. ఎన్నికల ముంగిట వివేకానంద రెడ్డి హత్య సైతం సానుభూతి తెచ్చిపెట్టింది. మరోవైపు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లడం.. బిజెపిని విభేదించడం కూడా వైసీపీకి కలిసి వచ్చింది.
అయితే గత ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలను దూరం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్ వైఖరి చంద్రబాబుకు అస్త్రం ఇచ్చినట్లు అయ్యింది. గత ఎన్నికల్లో అదే హత్య కేసును అడ్డం పెట్టుకుని జగన్ సానుభూతి పొందారు. ఒకానొక దశలో నారాసుర రక్త చరిత్ర అంటూ తన సాక్షిలో రాసుకొచ్చారు. ఇప్పుడు అదే కేసులో జగన్ వైపు అందరివేళ్ళు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబం అనుమానం పడేలా పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితుల్లో సోదరి షర్మిల, వివేక కుమార్తె సునీతను.. జగన్ పై ప్రయోగించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఈ అంశం తప్పకుండా ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని ఆశిస్తున్నారు.
అన్నింటికీ మించి జగన్ పై పవన్ ను ఒక ఆయుధంలా చంద్రబాబు వాడుకుంటున్నారు. అదే సమయంలో బిజెపిని తమ వైపు తిప్పుకున్నారు. ఎన్నికల్లో గతం మాదిరిగా జగన్ కు ఎటువంటి సాయం అందకుండా చేసుకున్నారు. మరోవైపు జగన్ సంక్షేమ పథకాలకు ధీటుగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. ప్రజాకర్షణ మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడ్డారు. ఇలా ఎలా తీసుకున్నా జగన్ చుట్టూ చంద్రబాబు వల అల్లారు. దానిని జగన్ ఛేదిస్తారా? లేదా? అన్నది ఈ ఎన్నికల్లో తేలిపోనుంది.