Sharmila Son Marriage: వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం నిశ్చయమైంది. అట్లూరి ప్రియతో ఈ నెల 18 న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద వివాహ తొలి ఆహ్వాన పత్రికను ఉంచేందుకు కుటుంబ సభ్యులతో వెళ్ళనున్నట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు. దీంతో పెళ్లి బాజాను మోగించారు. అయితే ఈ వివాహానికి జగన్ వెళ్తారా? వెళ్తే హాజరయ్యేందుకు మాత్రమే వెళ్తారా? లేకుంటే మేనల్లుడు పెళ్లిని బాధ్యతగా తీసుకుంటారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉప్పు నిప్పులా ఉన్న షర్మిల, జగన్ కలిసేందుకు ఇదో వేదిక అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసిపికి రాజకీయంగా నష్టం జరగనుంది. అందుకే షర్మిల ఎంట్రీ ని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నించారని.. తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ద్వారా కూడా రాజీ ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో షర్మిల కుమారుడు వివాహం అంది వచ్చిన అవకాశంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షర్మిల తో సఖ్యత కుదుర్చుకునేందుకు మంచి అవకాశం గా చెబుతున్నారు. దీనిని ఎలా వాడుకుంటారనేది జగన్ ఆలోచన పై ఆధారపడి ఉంది. వారిద్దరి మధ్య కలుసుకు లేనంతగా విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు జగన్ గురించి షర్మిల చిన్న వ్యతిరేకత మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే మాత్రంటార్గెట్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే రాజకీయంగా జగన్ కు ఇబ్బందికరమే. అందుకే రాజీ చేసుకోవడమే ఉత్తమమని ఆయనకు సన్నిహితులు సలహా ఇస్తున్నారు.
అయితే ఈ వివాహానికి అసలు జగన్ హాజరవుతారా? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తొలుత జగన్ కుమార్తెను రాజారెడ్డి వివాహమాడతారని టాక్ నడిచింది. కానీ రాజారెడ్డి అట్లూరి ప్రియతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉండడంతో ఆ వార్త తప్పు అని తేలింది. అందుకే మేనల్లుడు పెళ్లికి తప్పకుండా జగన్ హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వైఎస్ బిడ్డల మధ్య సహృద్భావ వాతావరణం వచ్చేందుకు ఇదో వేదిక అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది అటు జగన్, ఇటు షర్మిల ఆలోచనలు బట్టి ఉంటుంది. చెల్లెలి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే కేవలం హాజరు వేసుకునేందుకే జగన్ పరిమితం అవుతారా? అంతకుమించి బాధ్యతలు వేసుకుంటారా? చెల్లెలితో మనసు విప్పి మాట్లాడతారా? అనేది చర్చ నడుస్తోంది. వేడుకలకు షర్మిల ఆహ్వానం, జగన్ స్పందన బట్టి కూడా ఒక అంచనాకు రావచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.