Roja: మాజీ మంత్రి రోజా రాజకీయాలకు గుడ్ బై చెబుతారా? లేకుంటే పార్ట్ టైం రాజకీయాలకు పరిమితం అవుతారా? మళ్లీ ముఖానికి రంగేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. చాలా రోజులుగా రోజా ఏపీ వైపు చూడడం లేదు. కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు. అవసరం అన్నప్పుడు కొద్దిపాటి విమర్శలతో రికార్డింగ్ వీడియోలను మీడియాకు విడుదల చేస్తున్నారు. పైపెచ్చు గతం మాదిరిగా తీవ్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడడం లేదు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై గట్టి విమర్శలు చేయడం లేదు. దీంతో రోజాలో ఏదో రకమైన మార్పు వచ్చిందని టాక్ నడుస్తోంది. పైగా ఆమె తిరిగి సినిమాల్లోకి వెళ్తారని తెలుస్తోంది. మరోవైపు బుల్లితెరపై కూడా కనిపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ ప్రయత్నాల్లో ఉన్న ఆమె.. ప్రస్తుతానికి పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఓటమితో సైలెంట్
వైసీపీ ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి రోజా ఒకరు. వైసిపి ఆవిర్భావము నుంచి ఆ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. 2014 తో పాటు 2019 ఎన్నికల్లో కూడా ఆమె నగిరి నుంచి గెలిచారు. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె చాలా దూకుడుగా వ్యవహరించారు. గత ఐదేళ్లలో అయితే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకొని మాట్లాడేవారు. అప్పట్లో ఆమెకు వైసిపి అధినాయకత్వం నుంచి పూర్తిగా స్వేచ్ఛ దొరకడంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయేవారు. దాదాపు ఐదేళ్లు కూటమి పార్టీల్లోని నేతలందర్నీ ముప్పు తిప్పలు పెట్టగలిగారు రోజా. అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పత్తా లేకుండా పోయారు. కనీసం సొంత నియోజకవర్గ నగిరి కి కూడా అందుబాటులో లేకుండా పోవడం విశేషం.
* కేసుల భయంతోనే
అయితే ప్రస్తుతం చెన్నైలో ఆమె నివాసం ఉంటున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా వ్యవహరించిన రోజాపై ఇప్పుడు ఒక్కో కేసు నమోదు అవుతూ వస్తోంది. అప్పట్లో తాను నిర్వహించిన క్రీడల శాఖకు సంబంధించి చాలా రకాల అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ సైతం కొనసాగుతోంది. ఆమె సైలెంట్ కావడానికి కేసులే కారణమని తెలుస్తోంది. అందుకే కొద్ది రోజులు పొలిటికల్ లైఫ్ కు గుడ్ బై చెప్పి.. మేకప్ వేసుకోవాలని రోజా భావిస్తున్నట్లు సమాచారం. తమిళంలో సైతం సినిమాలతో పాటు బుల్లితెరలో నటించేందుకు రోజా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని రోజా సంకేతాలు పంపారు. అదే సమయంలో పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గించారు.