Chandrababu : ఏపీలో పింఛన్ల పంపిణీ పై రగడ జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన పింఛన్ల పంపిణీ ప్రక్రియ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే అందుకు కారణం మీరంటే మీరు అని అధికార వైసిపి తో పాటు విపక్ష టిడిపి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వమే ముందుగా ఏప్రిల్ 3 నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పిందని టిడిపి ఆరోపిస్తుండగా.. చంద్రబాబు తెర వెనుక ఉండి ఈసీకి ఫిర్యాదు చేయించారని.. వాలంటీర్ల సేవలను నిలిపి వేయించారని.. అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యమైందని వైసిపి ఆరోపిస్తోంది. అయితే ఇన్నాళ్లు ఇంటి వద్ద పింఛన్ తీసుకున్న వృద్దులు.. ఎండలో సచివాలయాల వద్దవేచి ఉండడం కనిపించింది. ఈ తరుణంలో కొంతమంది అనారోగ్యం బారిన పడి మృతి చెందారు. దీంతో ఆ వృద్ధుల మృతికి మీరంటే మీరు కారణమని అధికార విపక్షాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబును కార్నర్ చేస్తూ వైసీపీ చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. దీంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు.
ఇప్పటికే పింఛన్ మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పింఛన్ల పంపిణీ పై రగడ జరిగిన నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తాము హామీ ఇచ్చినట్టు ఏప్రిల్ నెల నుంచే 4000 పింఛన్ అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. జూన్ లో ఎన్నికల ఫలితాలు వస్తాయి. జూలై నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. అప్పుడే ఏప్రిల్,మే, జూన్ నెలలకు సంబంధించి పింఛన్లు ఒకేసారి అందిస్తాం. వరుసగా మూడు నెలలు తీసుకోకపోయినా తరువాత నెల అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.ఇప్పుడు ఇదే రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపైనే చర్చ నడుస్తోంది.
చంద్రబాబు తాజా ప్రకటన గేమ్ చేంజర్ అవుతుందని టిడిపి నేతలు ఆశిస్తున్నారు. టిడిపి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 45 సంవత్సరాలు దాటిన బిసి లబ్ధిదారులకు పింఛన్ అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అయితే వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తొలగించాలన్న ఈసీ ఆదేశాల వెనుక చంద్రబాబు ఉన్నారన్నది వైసీపీ ఆరోపణ. గత నాలుగున్నర సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో చంద్రబాబు వలంటీర్ వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేశారు కూడా. ఇటువంటి తరుణంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. దీంతో తక్షణ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు ఈ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పడం సంచలనం గా మారింది. కచ్చితంగా ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తుందని టిడిపి నేతలు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.