BJP Party : ఢిల్లీలో( Delhi) ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అక్కడ అధికారం దక్కించుకుంది. అదే స్ఫూర్తితో మిగతా రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని చూస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని తప్పకుండా భావిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ప్రస్తుతం మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. టిడిపి ఆధ్వర్యంలో కూటమి పాలన సాగిస్తోంది. అయితే ఒక వైపు కూటమితో ఉంటూనే మరోవైపు సొంతంగా ఎదగాలని చూస్తోంది. ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వీలైనంత ఎక్కువ సీట్లు పొందాలి అన్నది బిజెపి ప్లాన్ గా తెలుస్తోంది.
* ఒక్క జనసేనతో వెళ్లాలన్నదే ప్లాన్
వాస్తవానికి ఏపీలో( Andhra Pradesh) జనసేనతో కలిసి వెళ్లాలన్నది ప్రారంభం నుంచి బిజెపి చేసిన ఆలోచన. అయితే టిడిపి లేనిదే అధికారం అసాధ్యమని జనసేన భావించింది. అదే విషయాన్ని బిజెపికి చెప్పడంతో మూడు పార్టీల పొత్తుకు అంగీకారం కుదిరింది. అయితే భవిష్యత్తులో కేవలం జనసేనతో మాత్రమే ముందడుగు వేయాలని బిజెపి చూస్తోంది. ఇప్పటికే దేశంలో ఇండియా కూటమి బలం తగ్గుతోంది. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ లాంటి పెద్ద ప్రాంతీయ పార్టీని సమన్వయం చేసుకోవాలని చూస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎదురు తిరిగితే మాత్రం నిర్వీర్యం చేసే ప్లాన్ కూడా బిజెపి వద్ద ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆ మూడు పార్టీలు కలిసి సాగితేనే వారికి బలం. లేకుంటే ఇబ్బందికరమే.
* ఒడిస్సా ఉదంతమే ఉదాహరణ..
అయితే ఒడిస్సా( Odisha) ఉదాంతాన్ని తీసుకుంటే బిజెపి ప్లాన్ ఒకలా ఉండదు. 25 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నవీన్ నేతృత్వంలోని బి జె డి తో కొనసాగింది బిజెపి సఖ్యత. కానీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఒంటరి పోరుకు సిద్ధపడింది బిజెపి. పరిస్థితి తనకు అనుకూలంగా ఉన్న సమయంలో పావులు కదిపింది. సొంతంగా పోటీ చేసి అధికారంలోకి రాగలిగింది. సార్వత్రిక ఎన్నికల్లో అసలు బీజేడీకి స్థానం లేకుండా చేసింది. ఆ పార్టీకి ఒక్క సీటు రాకుండా పట్టు బిగించింది. మొత్తానికి అయితే ఒడిస్సా ఉదంతం ఏపీకి ఒక ఉదాహరణ. అయితే తాజాగా ఢిల్లీలో గెలిచి మంచి ఊపు మీద ఉన్న బిజెపి తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలపై పడుతుంది. అందులో ముందుగా ఏపీ ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
* చివరి నిమిషంలో అంచనా వేసి..
ఏపీలో ( Andhra Pradesh)ఇప్పుడు బిజెపి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేంద్రంలో టిడిపి మద్దతు ఆ పార్టీకి అవసరం. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బిజెపి అడుగులు వేయనుంది. అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి డోకా లేదు. ఒకవేళ టిడిపి కూటమికి ప్రజల్లో ఆదరణ తగ్గితే.. కేవలం జనసేనతో మాత్రమే బిజెపి అడుగులు వేసే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు వైసీపీ ఆప్షన్ ఎలానూ ఉంది. అందుకే ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది. ఏపీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునేందుకు అయినా బిజెపి వెనుకడుగు వేయదు. అదే సమయంలో చంద్రబాబు లాంటి నేతను తక్కువగా కూడా అంచనా వేయదు. చూడాలి మరి ఏపీలో భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో..