Balakrishna: బాలయ్య హ్యాట్రిక్ కొడుతాడా? హిందుపూరంలో గెలుస్తాడా? పరిస్థితులు ఎలా ఉన్నాయి?

2014 ఎన్నికల్లో తొలిసారిగా నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి బరిలో దిగారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడంతో.. హిందూపురంలో తనదైన ముద్ర వేసుకున్నారు.

Written By: Dharma, Updated On : April 8, 2024 10:05 am

Balakrishna

Follow us on

Balakrishna: హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ పై దృష్టి పెట్టారు. గత రెండు ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి ఎన్నికవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వైసిపి టార్గెట్ చేసిన నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. అక్కడ వైసిపి గెలుపు బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి జగన్ అప్పగించారు. గత కొన్నేళ్లుగా పెద్దిరెడ్డి అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. టిడిపి లీడర్స్ తో పాటు క్యాడర్ ను వైసీపీ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఎన్నికల ముంగిట ఆ వ్యూహం వర్కౌట్ కావడం లేదు. ఒక్కొక్క నేత వైసీపీని వీడుతుండడం ఆ పార్టీకి ప్రతికూల అంశంగా మారింది. బాలకృష్ణ లో ధీమా పెంచుతోంది.

2014 ఎన్నికల్లో తొలిసారిగా నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి బరిలో దిగారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడంతో.. హిందూపురంలో తనదైన ముద్ర వేసుకున్నారు. గత ఎన్నికల్లో వైసిపి ప్రభంజనంలో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. 52 స్థానాలకు గాను తెలుగుదేశం గెలిచింది మూడు స్థానాలే. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచారు. అందుకే ఈసారి ఈ మూడు నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని జగన్ డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు వైసీపీ ఇన్చార్జిలను మార్చడం ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల ముంగిట నేతలు వైసీపీని వీడడానికి కారణమైంది.

గత ఎన్నికల్లో బాలకృష్ణపై ముస్లిం వర్గానికి చెందిన ఇక్బాల్ పోటీ చేశారు. గట్టి పోటీ ఇచ్చారు. అయితే గత ఐదేళ్లలో హిందూపురంలోనే టిడిపి క్రియాశీలక నాయకులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలోకి రప్పించారు. దిగువ స్థాయి కేడర్ ను సైతం కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇది అసలుకే ఎసరు వచ్చింది. వైసీపీ శ్రేణులతో కొత్తగా చేరిన టిడిపి శ్రేణులు సమన్వయం సాధించలేదు. పైగా టిడిపి నుంచి వచ్చిన వారికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఎన్నికల ముంగిట దీపిక అనే మహిళను ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు ఆమెనే అభ్యర్థిని చేశారు. గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన సైతం ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. కానీ జగన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆయన వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఎన్నికల ముంగిట వైసీపీకి గట్టి షాక్ తగిలింది.

హిందూపురం నియోజకవర్గంలో ముస్లింలు అధికం. అందుకే గత ఎన్నికల్లో వైసిపి ఆ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని కొంతవరకు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా అవినీతి లేదనేది బాలకృష్ణ కు ఉన్న మంచి పేరు. దీంతోనే ఆయన 2019లో గట్టెక్కగలిగారు. ఇప్పుడు వైసీపీ నుంచి కీలక నేత టిడిపిలోకి రావడం, ప్రభుత్వ వ్యతిరేకత భారీ స్థాయిలో ఉండడంతో.. తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బాలకృష్ణ ధీమాతో ఉన్నారు. నిన్న జరిగిన నియోజకవర్గ మూడు పార్టీల సమన్వయ సమావేశంలో సైతం బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం అని తేల్చి చెప్పారు. మొత్తానికైతే హిందూపురంలో హ్యాట్రిక్ కొడతానని బాలకృష్ణ గట్టి ధీమాతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.