Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో కొత్త విభాగం ప్రారంభం కానుందా? పార్టీ అనుబంధ సంఘాలకు జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేయనున్నారా? వాటితోనే పూర్వవైభవం సాధ్యమని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒలంటీర్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు జగన్మోహన్ రెడ్డి. వారికి తోడు ఐప్యాక్ తో పాటు పార్టీ సోషల్ మీడియా విభాగానికి కూడా పెద్దపీట వేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులను విస్మరించారన్న విమర్శ ఉంది. అదే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓటమికి కారణమైందన్న నివేదికలు కూడా జగన్మోహన్ రెడ్డికి అందాయట. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీలో కార్యవర్గాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే పార్టీకి దూకుడు పెంచే విధంగా ఓ విభాగాన్ని తెరపైకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామస్థాయిలో ఓటమి దూకుడుకు అడ్డుకట్ట వేసే విధంగా ఒక బలమైన విభాగాన్ని తెరపైకి తేనున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* మారిన పరిస్థితులతో
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ప్రమాదంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు. మరికొందరు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ గా ఉన్నారు. ఇంకోవైపు కూటమి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగాది నుంచి ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు. అంతకుముందే పార్టీలో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఓటు శాతం పెంచుకోవాలని
ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోయినా 40 శాతం ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది. దానిని నిలబెట్టుకోవడంతోపాటు తటస్తుల్లో సైతం పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). తనతో పాటు దూకుడుగా ఉండే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా జగన్ సేన పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తొలుత ఉభయ గోదావరి తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువకులను జగన్ సేనలో చేర్చి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు.
* ఓటమి బాధ నుంచి తేరుకొని
ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజుల పాటు డీలా పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటమి నుంచి తేరుకొని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారు. ఇప్పుడు యువకులతో ప్రత్యేకంగా జగన్ సేన కమిటీలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఓ 50 మందితో పటిష్టమైన విభాగం ఏర్పాటు చేయనున్నారు. మండలము, నియోజకవర్గం, జిల్లాస్థాయిలో ఈ కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి ప్రచారం చేయడమే టార్గెట్ గా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.