Wife Lover Crime: ప్రాంతం మారుతోంది. సంఘటన జరిగిన తీరు మారుతోంది. కానీ జరిగిన దారుణంలో భర్త ప్రాణమే పోతోంది. భార్య, ఆమె ప్రియుడే కారణమని తేలుతోంది. ఒకటి కాదు రెండు కాదు, లెక్కకు మిక్కిలి ఘటనలు.. అంతకుమించి అనే స్థాయిలో ఘోరాలు.. మీడియాలో ప్రసారమవుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. అయినప్పటికీ ఈ దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. పైగా సరికొత్త రీతిలో దారుణాలు జరుగుతున్నాయి. విభిన్న రకాలుగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి.. సరిగ్గా రెండు రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట.. అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి లో భార్యల చేతిలో భర్తలు హతమయ్యారు. వీటి కంటే ముందు నాగర్ కర్నూల్ జిల్లాలో భార్య చేతిలో భర్త అంతమయ్యాడు. ఈ ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ దారుణాలు తీవ్రస్థాయిలో కలకలం సృష్టించాయి. వీటిని మర్చిపోకముందే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని రావూరులో ఘటన తీవ్రస్థాయిలో కలకలం సృష్టించింది. బుధవారం జరిగిన ఈ ఘటన సమాజంలో చోటు చేసుకున్న పెడ పోకడలకు అద్దం పట్టింది.
భార్యలను భర్తలు అంతం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలే ఈ దారుణాలకు కారణమవుతున్నాయి. భర్తలను భార్యలు తమ ప్రియుళ్ల సహకారంతో అంతం చేస్తున్న తీరు ఆవేదన కలిగిస్తున్నది. భర్తలను అంతం చేస్తున్న తీరు నేర కథాంశంతో రూపొందిన సినిమాలను మించిపోతున్నది. పైగా ఇటువంటి కేసులో దర్యాప్తులో పోలీసులకు దిమ్మతిరిగిపోతోంది. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఈ దారుణాలు ఉండడంతో ఏం చేయాలో పోలీసులకే అంతుపట్టడం లేదు. పైగా ప్రతి ఘటనలోనూ సరికొత్త పంథా ను నిందితులు అనుసరిస్తున్న తీరు మింగుడు పడటం లేదు.. కారుతో గుద్దించడం, కిరాయి వ్యక్తులతో కత్తులతో పొడిపించడం, మాయమాటలు చెప్పి వేరే వ్యక్తులతో దాడి చేయించడం, కూల్ డ్రింక్ లో కలుపు నివారణ మందు కలిపి తాగించడం.. ఈ తరహాలో ఇటీవల కాలంలో భర్తల మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: Telangana Crime News: ఈమె ఉత్తమ ఇల్లాలు.. ప్రియుడు, మొదటి భర్త కొడుకుతో కలిసి రెండో భర్త హతం
ఇక నెల్లూరు జిల్లా రావూరు ప్రాంతంలో తన భర్తను భార్య ప్రియుడితో కలిసి అంతం చేసింది. అతనికి ఏకంగా విద్యుత్ తీగను గొంతుకు బిగించి.. ఊపిరి ఆడకుండా చేసి కన్నుమూసేలా చేసింది. రావూరు ప్రాంతంలోని లేపాకశీనయ్యకు గతంలో ధనముతో వివాహం జరిగింది. ధనమ్మ, శ్రీనయ్య కొద్దిరోజులపాటు బాగానే ఉన్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వెలుగు చూశాయి. ఇదే క్రమంలో ధనమ్మ కళ్యాణ్ అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ విషయం శ్రీనయ్యకు తెలిసింది. దీంతో అతడు ధనమ్మను నిలదీశాడు. అంతేకాదు వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించాడు. భర్త తమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ధనమ్మ భావించింది. అతడికి ఎదురు తిరగడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ధనమ్మ వ్యవహార శైలి పట్ల శ్రీనయ్య తీవ్ర అగ్రహంతో ఉన్నాడు. ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో వారు పంచాయతీలు కూడా నిర్వహించారు. సక్రమంగా ఉండాలని సూచించారు. ఇంత జరిగినప్పటికీ ఆమె తన తీరు మార్చుకోలేదు. పైగా మరింత ఇష్టానుసారంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. తన భార్య చేస్తున్న తీరును శ్రీనయ్య తట్టుకోలేకపోయాడు. ఆమెను కొట్టాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ధనమ్మ.. ప్రియుడు కళ్యాణ్ తో చర్చించింది. శ్రీనయ్యను అడ్డు లేకుండా చూసుకోవాలి అనుకుంది. దానికి తగ్గట్టుగానే వారిద్దరు ఒక ప్లాన్ వేశారు. కళ్యాణ్, ధనమ్మ విద్యుత్ తీగతో శ్రీనయ్య గొంతు బిగించారు. ఊపిరి ఆడకుండా చేసి అంతం చేశారు. అయితే ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వారిద్దరిని అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జైలుకు తరలించారు.