Jagan: ఎన్నికల సీజన్ కావడంతో ప్రతి నిమిషం నేతలకు కీలకమే. అందుకే ఏమాత్రం చిన్న అవకాశం ఉన్న ప్రజలను కలుసుకునేందుకు సిద్ధపడతారు. కానీ జగన్ మాత్రం అలా చేయడం లేదు. ప్రస్తుతం ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు. రాత్రి పది గంటల వరకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉన్నా.. ఏడు గంటలకే దుకాణం సర్దేస్తున్నారు. అందరికీ నమస్కారం చేసి.. చీకటి పడుతోంది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ప్రతి సభలోను ఇదే సీన్ కనిపిస్తోంది. అయితే అలా ఎందుకు చేస్తున్నారో వైసిపి శ్రేణులకు సైతం అంతుపట్టడం లేదు.
అసలు 2023 వరకు జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను విడిచిపెట్టి రాలేదు. ఒకవేళ రావాల్సి వచ్చినా పరదాల మాటున ప్రయాణం చేసేవారు. దారి పొడవునా చెట్లు నరికి, రోడ్లను ధ్వంసం చేసేవారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే భద్రత కంటూ సమాధానం చెప్పేవారు. సీఎం ఎక్కడికి వెళ్తే ఆ చోట పచ్చని చెట్లు, మంచి మంచి రహదారులు ధ్వంసం కావాల్సిందే. అక్కడ ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. దేశ ప్రధాని కైనా అంత సెక్యూరిటీ ఉండేది కాదు. అయితే జగన్ ఈ తరహా ప్రవర్తన వెనుక భయం అనే మాట ప్రధానంగా వినిపిస్తుంది. ప్రజల కోసం విరివిగా సంక్షేమ పథకాలు అమలు చేయడం, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయానని చెప్పిన జగన్.. అదే ప్రజలను కలుసుకునేందుకు మాత్రం ఒక రకమైన ఇబ్బంది పడేవారు. భయపడేవారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో సైతం స్వేచ్ఛగా ప్రజలను కలవాల్సింది పోయి.. కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
గత ఐదు సంవత్సరాలుగా విలేకరుల సమావేశం నిర్వహించింది కూడా చాలా అరుదు. విలేకరులతో ముఖాముఖిగా మాట్లాడడానికి కూడా జగన్ భయపడుతున్నారన్న విమర్శ ఉంది. ఈ ఐదేళ్లలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా విలేకరులతో మాట్లాడిన దాఖలాలు లేవు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేరనా.. లేకుంటే వారితో మాట్లాడడం దండగ అని భావిస్తున్నారో తెలియడం లేదు. అయితే జగన్కు భయం పట్టుకుందున్న భావన సొంత పార్టీ నేతల్లోనూ కనిపిస్తోంది. ఆయన పర్యటనల్లోనూ భద్రతా సిబ్బంది చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన వారికి మాత్రమే ఆయన కలవగలుగుతున్నారు. మిగతా వారిని దూరం పెడుతున్నారు. ఏటా తనతో పాటు తన కుటుంబ సభ్యుల భద్రత కోసం 300 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ భద్రత వెనుక భయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది రాజకీయ ప్రత్యర్థుల వల్ల, లేకుంటే తన చేతిలో బాధితులుగా మిగిలిన వారి నుంచి ఏమైనా అపాయం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే సీఎం భయం సామాన్యులకు శాపంగా మారుతోంది.