Changing Media Landscape: కాలం మారింది. మీడియాలో వచ్చేవన్నీ నిజాలని నమ్మే పరిస్థితి పోయింది. వెనుకటి రోజుల్లో వాస్తవాలకు వార్తాపత్రికలు దర్పణంగా ఉండేవి. అందువల్లే నాటి రోజుల్లో విలేకరులకు సమాజంలో గౌరవం ఉండేది. రాను రాను పత్రికలు ప్రాధాన్యం కోల్పోవడం.. పత్రికా యజమానులు రాజకీయ రంగులు పూసుకోవడం.. అడ్డగోలు వ్యవహారాలలో తలదుర్చడంతో పత్రికలు అంటే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఎలక్ట్రానిక్ మీడియా పత్రికల కంటే దారుణంగా మారిపోయింది. ఎవరికివారు ఛానల్ ఏర్పాటు చేసుకోవడం.. నచ్చిన పార్టీని మోయడం.. నచ్చని పార్టీ మీద దుమ్మెత్తిపోవడం పరిపాటిగా మారింది. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియా ప్రధాన మీడియాను మించి ఎదిగింది. సోషల్ మీడియా లో వెర్రి వెయ్యి తలలు వేసినప్పటికీ.. అందులోనే కొద్దిగా గొప్ప నిజం తెలుస్తోంది.
Also Read: బుద్ధి లేదా నీకు అంటూ రిపోర్టర్ పై నాగార్జున ఫైర్.. వీడియో వైరల్!
కరోనా తర్వాత
కరోనా తర్వాత పేపర్ల వ్యాల్యూ మరింత పడిపోవడంతో.. కొంతమంది యాజమాన్యంగా ఏర్పడి.. స్వల్ప పెట్టుబడితో ఓ ప్రయోగంగా డిజిటల్ పేపర్ ను అందుబాటులో తీసుకొచ్చారు. దానికి రెండు అక్షరాల పేరును నిర్ణయించారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఎడిషన్ పేరుతో వార్తలను ప్రచురించడం మొదలుపెట్టారు. ఖర్చు లేదు కాబట్టి.. కేవలం ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి దానిని తెగ ప్రమోట్ చేసుకున్నారు. తెలుగు పత్రిక చరిత్రలో ఇది కొత్త ప్రయోగం కాబట్టి మొదట్లో చాలామంది ఆసక్తి చూపించారు. ఆ రెండక్షరాల డిజిటల్ పేపర్ కు విలువ పెంచారు. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. డిజిటల్ పేపర్లో పని చేసేవారు వసూళ్లకు దిగడంతో ప్రతిష్ట మసకబారిపోయింది. పైగా ఆపత్రిక ఓ రాజకీయ పార్టీకి తలలో నాలుక లాగా మారిపోవడంతో విలువ పడిపోయింది. పెద్ద పెద్ద పేపర్లు డిజిటల్ విభాగంలో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఈ రోజుల్లో చదివేవారు ఎవరూ లేరు. ఏదైనా సరే రెండు నిమిషాల్లోనే పూర్తి కావాలి. అలాంటప్పుడు అంతగా పసలేని ఈ రెండక్షరాల డిజిటల్ పేపర్ ఎవరు చదువుతారు.. పైగా ఈ డిజిటల్ పేపర్లో పని చేసే జర్నలిస్టులకు రకరకాల ఆంక్షలున్నాయి. దీనికి తోడు అందులో పని చేసే పాత్రికేయులకు జీతాలు పెంచడం లేదు. జీతాల పెంపుదల గురించి పాత్రికేయులు అడిగితే యాజమాన్యం రకరకాల కారణాలు చెబుతోంది. వాస్తవానికి యాజమాన్యం దుస్థితికి పాత్రికేయులు ఎలా కారణమవుతారు? రేపటినాడు యాజమాన్యానికి విపరీతమైన లాభాలు వస్తాయి.. ఆ లాభాలలో వాటా ఏమైనా పాత్రికేయులకు ఇస్తుందా? లేదు కదా.. అలాంటప్పుడు పాత్రికేయులకు వేతనాలు పెంచే వెసలుబాటు లేనప్పుడు పత్రికను నడపాల్సిన అవసరం ఏముంది..
ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసింది
ఇక ఇప్పుడు అదే పత్రిక ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.. న్యూస్ యాంకర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు కావాలని ప్రకటన చేసింది. క్రియేటివ్ ఆలోచనలు, సామాజిక మాధ్యమాల పట్ల ఆసక్తి ఉన్నవారికి అద్భుతమైన అవకాశం అంటూ ఊదరగొడుతోంది.. సామాజిక మాధ్యమాలలో పట్టు.. ట్రెండింగ్ టాపిక్స్ మీద అవగాహన.. కృత్రిమ మేధ పై అనుభవం ఉండాలని పేర్కొంది. ఉన్న డిజిటల్ ఎడిషన్ లో ఉద్యోగుల వేతనాల పెంపుదలకు దిక్కులేదు.. పైగా ఆ డిజిటల్ పత్రిక ఎడిటర్ ఉదయం లేస్తే విలువల గురించి మాట్లాడతారు. పాత్రికేయం గురించి గొప్పగా చెబుతారు. కానీ ఆయన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి మాత్రం నిశ్శబ్దంగా ఉంటారు. అందుకే అంటారేమో చెప్పడానికి విలువలు.. పాటించడానికి కాదని.. అయినా డిజిటల్ పేపర్ లోనే లాభాలు లేనప్పుడు.. విపరీతమైన పోటీ ఉండే యూట్యూబ్ లో మాత్రం లాభాలు ఎలా వస్తాయి.. పాపం ఆ మేనేజ్మెంట్ కు ఎవరైనా చెప్పండయ్యా పిండి కొద్ది రొట్టె అని..