KCR : విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీ లకు పడిపోయింది.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. నిండు వానాకాలంలో ఇలా జరగడం ఒక రకంగా ఇబ్బందికరమే అయినప్పటికీ.. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నప్పటికీ నీటిని తరలించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోంది. ఇది ఒక రకంగా తెలంగాణ వాదులకు ఆగ్రహాన్ని కలిగించే పరిణామం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా చేస్తోందని నమస్తే తెలంగాణ రెండు రోజులుగా వార్తలు రాస్తోంది. ఆ పథకం పనులకు సంబంధించిన ఫోటో లను నమస్తే తెలంగాణ ఎక్స్ క్లూజివ్ గా వేసింది. పాత్రికే కోణంలో.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇది అభినందించదగ్గ ప్రయత్నం. నమస్తే తెలంగాణ గడ్డముందు వెలుగు పత్రిక ఈ ఎత్తిపోతల పథకం గురించి వార్తలు రాసింది. అప్పటి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు దీనిపై పెద్దగా స్పందించలేదు.. ఇక ఉద్యమ సమయంలో పోతిరెడ్డిపాడు పొక్కను పెంచుతున్నారని కేసీఆర్ గగ్గులు పెట్టారు. తనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఒక మాట కూడా మాట్లాడలేదు. శ్రీశైలంపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇదే సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టాడు. నాడు జగన్మోహన్ రెడ్డితో సాన్ని హిత్యం ఉన్నప్పటికీ కేసీఆర్ ఒక్కసారి కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అప్పట్లో ఆంధ్రజ్యోతి దీని గురించి రాయలేదు. సాక్షి ఎలాగూ పట్టించుకోలేదు. నమస్తే తెలంగాణ నాడు అధికారంలో ఉంది కాబట్టి లెక్కలోకి తీసుకోలేదు. ఇక ఈనాడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో వెలుగు రాసింది గాని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. నాడు జగన్ తో ఉన్న సంబంధాల దృష్ట్యా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నమస్తే తెలంగాణ ఏమాత్రం లక్షపెట్టలేదు. అయితే ఇదే అదునుగా జగన్ పనుల్లో వేగం పెంచాడు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. రాజకీయపరంగా విభేదాలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో టిడిపి, వైసిపి ఒకే విధంగా పనిచేస్తాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి పూర్తి విరుద్ధం. ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఒక్కరోజు కూడా గొంతు ఎత్తలేదు. పైగా ఆ ప్రాజెక్టు పనులపై న్యాయపోరాటం చేసినట్టు నమస్తే తెలంగాణ తనకు తానే సొంతంగా ఓ సర్టిఫికెట్ ఇచ్చుకుంది.
అధికారంలో లేదు కాబట్టి రాసింది..
నమస్తే తెలంగాణ రాసిన కథనం ఒకరకంగా సంచలనం సృష్టించగా.. దానిపై కాంగ్రెస్ పార్టీ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటికీ నాగార్జున, సమంత, సురేఖ వివాదం నుంచి ఆ పార్టీ బయటపడలేదు. ఇక శ్రీశైలంలో పూడిక పెరిగి పోతోంది. పైన ఉన్న కర్ణాటకలో అడ్డగోలుగా కృష్ణానది నీటి వాడకం జరుగుతోంది. ఆల్మట్టి ఎత్తు కూడా పెంచుతారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పులు రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టు పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతున్నాయి. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కాలేశ్వరం ఎత్తిపోతల పథకం మీద పెట్టిన దృష్టి.. మిగతా వాటిపై పెట్టకపోవడంతో.. తెలంగాణ ప్రయోజనాలు గాలికి కొట్టుకుపోయాయి. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి.. అధికారాన్ని దక్కించుకోవాలి కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో నమస్తే తెలంగాణ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి రాసింది. ఒకవేళ అధికారంలో ఉంటే దాని వైపు చూడకపోయేది.. కనీసం పట్టించుకోకపోయేది.. కాలేశ్వరం గురించి నిండుగా రాసేది. మేడిగడ్డ కుంగిపోయినా.. పంపు హౌస్ లో మునిగిపోయినా.. సింగిల్ కాలం వార్త కూడా రాలేకపోయేది. ఇప్పుడు హఠాత్తుగా రాయలసీమ లిఫ్ట్ వార్త రాసింది అంటే.. దాని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్లు కాదు తెలంగాణ ప్రజలు..