https://oktelugu.com/

AP BJP Leaders : ఏపీ బీజేపీ నేతలు ఎందుకు యాక్టివ్ అయ్యారు? అసలు వారి ప్లాన్ ఏంటంటే?

అసమ్మతి నాయకులను వైసీపీ చేరదీస్తే.. అసలుకే ఎసరు వస్తుందని చెబుతున్నారు. అందుకే చంద్రబాబు ఎంపీ స్థానాలను బీజేపీకి విడిచిపెట్టి.. అసెంబ్లీ స్థానాల విషయంలో కట్టడి చేస్తారన్న ప్రచారం ఉంది. చూడాలి మరి ఎలా ముందుకెళతారో?

Written By:
  • Dharma
  • , Updated On : June 12, 2023 / 08:45 AM IST
    Follow us on

    AP BJP Leaders : ఏపీ బీజేపీలో నాయకులకు కొదువ లేదు. కానీ బలమే చాటుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఉనికిని చాటుకుంటున్నారు. పెత్తనం చెలాయిస్తున్నారు. ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి జై కొడుతుండడంతో పబ్బం గడుపుకుంటున్నారు. పార్టీ బలోపేతం చేయాలని కానీ.. పార్టీ వాయిస్ ను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నించడం లేదు. ఒకరిద్దరు నాయకులకు అభిలాష ఉన్నా.. వారికి అడ్డు తగిలే వారు ఎక్కువ. అయితే ఇప్పుడు నాయకులు ఒక్కొక్కరూ తెరపైకి వస్తున్నారు. పోటీకి అన్నివిధాలా సిద్ధమవుతున్నారు. పొత్తుల వాతావరణం తెరపైకి రావడమే అందుకు కారణం.

    రాష్ట్రంలో బీజేపీ బలపడకపోవడానికి ఎన్నెన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా వర్గాలు కొనసాగుతున్నాయి. జగన్, చంద్రబాబు శ్రేయోభిలాషులు అధికం. ఎవరికి వారు అనుకూలంగా పావులు కదుపుతుండడంతో పార్టీ అనుకున్నంతగా డెవలప్ కావడం లేదు. కనీస స్థాయిలో సైతం ఓటు బ్యాంకు పెంచుకోవడం లేదు. పార్టీపై అగ్రనేతలు ఫోకస్ పెట్టకపోవడంపై ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు వరుసగా అగ్రనేతలు క్యూకట్టడంతో ఏపీలో ఏదో జరుగుతోందని సొంత పార్టీ శ్రేణులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పొత్తులపై నాయకత్వం ఆలోచిస్తుండడంతో చాలా నియోజకవర్గాలపై నేతలు కర్చిఫ్ వేస్తున్నారు.

    ఎంపీ సీట్లకు సంబంధించి  సుజనా చౌదరి (విజయవాడ) దగ్గుబాటి పురంధేశ్వరి (విశాఖపట్నం)  మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి (కడప) సీఎం రమేష్ (రాజంపేట) టిజి వెంకటేష్ (కర్నూలు) కామినేని శ్రీనివాస్ (ఏలూరు) సత్యకుమార్ (నెల్లూరు) జీవిఎల్ నరసింహారావు (నరసరావుపేట) నుంచి బీజేపీ తరుపున ఆశావహులుగా ఉన్నారు.  అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వరదాపురం సూరి(ధర్మవరం) విష్ణువర్ధన్ రెడ్డి(కదిరి) విష్ణుకుమార్ రాజు(విశాఖ నార్త్) భానుప్రకాశ్ రెడ్డి(తిరుపతి) సాధినేని యామినిశర్మ(గుంటూరు వెస్ట్) రమేష్ నాయుడు(రాజంపేట) పివిఎన్ మాధవ్(విశాఖ వెస్ట్) ఎస్.కే. భాజి(విజయవాడ వెస్ట్) అంజనేయరెడ్డి (నెల్లూరు సిటీ) పూడి తిరుపతి రావు(ఆముదాలవలస) సోము వీర్రాజు(రాజమండ్రి సిటీ) లంకా దినకర్ (గన్నవరం)లపై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం

    అయితే ఇవన్నీ టీడీపీకి స్ట్రాంగ్ స్థానాలు. ఆ పార్టీ అంత ఈజీగా వదులుకుంటుందంటే కుదిరే పని కాదంటున్నారు. అటు జనసేనకు సైతం సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన బీజేపీ మెజార్టీ స్థానాలు అడిగితే మాత్రం కుదిరే పనికాదని టీడీపీ కేడర్ చెబుతోంది. అదే జరిగితే పార్టీలో సంక్షోభం ఖాయమని ఆందోళన చెందుతోంది. అసమ్మతి నాయకులను వైసీపీ చేరదీస్తే.. అసలుకే ఎసరు వస్తుందని చెబుతున్నారు. అందుకే చంద్రబాబు ఎంపీ స్థానాలను బీజేపీకి విడిచిపెట్టి.. అసెంబ్లీ స్థానాల విషయంలో కట్టడి చేస్తారన్న ప్రచారం ఉంది. చూడాలి మరి ఎలా ముందుకెళతారో?