AP Survey: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార వైసిపి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ సంచలనాలకు తెరతీసింది. ఇప్పటివరకు నాలుగు జాబితాలను ప్రకటించింది. 60 మంది అభ్యర్థులను మార్చింది. మరో 20 మందిని మార్చనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధపడుతున్నారు. భీమిలి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. మరోవైపు జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. మరోవైపు చంద్రబాబు రా కదలిరా పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. అటు పవన్ సైతం రాష్ట్రస్థాయి పర్యటనలకు సిద్ధపడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు పై అన్ని పార్టీల్లో ధీమా కనిపిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. అందుకే వైసిపి ఓడిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసినందున.. మరోసారి అధికారంలోకి రాగలమని వైసిపి ధీమా కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గెలుపు ఎవరన్నది అంచనా వేయడం కష్టతరంగా మారింది. ఈ తరుణంలో జాతీయ మీడియా సంస్థలు, ప్రీ పోల్ సర్వేలు చేపట్టే ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. గత కొంతకాలంగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా మూడు సంస్థలు తమ సర్వేను వెల్లడించాయి. ఈ వీటి ఫలితాలన్నీ దగ్గరగా ఉండడం విశేషం. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలు తేల్చాయి. 52 శాతం మంది జగన్ సీఎం గా కోరుకుంటున్నారని తేల్చి చెప్పాయి.
పొలిటికల్ క్రిటిక్ సంస్థ వచ్చే ఎన్నికల్లో వైసీపీ 115 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. టిడిపి, జనసేన కూటమి 60 స్థానాలకు పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. మరోవైపు లోక్ పాల్ సంస్థ ఒపీనియన్ పోల్ సర్వే చేపట్టింది. కేవలం లోక్ సభ స్థానాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే చేపట్టింది. వైసీపీకి 13 నుంచి 15 లోక్ సభ స్థానాలు వస్తాయని.. టిడిపి, జనసేన కూటమికి 6 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చేసింది. మరోవైపు జెన్ మత్ పోల్ సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. 175 స్థానాలకు గాను వైసిపి 114 నుంచి 117 స్థానాలను గెలుచుకోనుందని స్పష్టం చేసింది. టిడిపి జనసేన కూటమి 49 నుంచి 51 స్థానాలకు పరిమితం కానుందని పేర్కొంది.
అయితే ఆది నుంచి సర్వేల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. కొద్ది నెలల కిందట ఏకపక్ష విజయాలను ఆ పార్టీ దక్కించుకోనుందని సర్వేలు తేల్చాయి. అయితే తాజాగా విడుదలైన సర్వేల ఫలితాల్లో మాత్రం మార్పు కనిపిస్తోంది. గతం కంటే విపక్ష కూటమి స్థానాలను మెరుగుపరుచుకోవడం విశేషం. ఇటు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు, అటు అధికార పక్షం అభ్యర్థుల మార్పు వంటివి ప్రభావితం చేయనున్నాయి. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో హోరాహోరి ఫైట్ ఉంటుందని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.